సమంత లీడ్ రోల్లో నటించి, స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' శుక్రవారం (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 'ఓ బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత నిర్మించారు. సుమారు రూ. 25-30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్) హక్కుల ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకుని, దాదాపు రూ.
35 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో టేబుల్ ప్రాఫిట్ సాధించడం విశేషం. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఎక్స్(ట్విట్టర్) ద్వారా తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, ఇది ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.
కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక కొత్త కోడలి పాత్రలో సమంత కనిపించారు. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, సున్నితమైన హాస్యం, ఎమోషన్స్‌తో పాటు ఊహించని విధంగా వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు. ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే...ఇక మొదటి ఆట నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు సందడి చేస్తున్నాయి.
ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా ప్రారంభం నుండి ప్రీ-ఇంటర్వెల్ వరకు కథ చాలా ఫ్రెష్‌గా, చక్కటి హ్యూమర్‌తో సాగిందని ఆడియన్స్ కొనియాడుతున్నారు. ముఖ్యంగా కొత్త కోడలి
పాత్రలో సమంత నటన, ఆమె సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్‌కు ఆమె పూర్తి న్యాయం చేసిందని, కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇదని కొందరు ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్ వీక్అయితే, సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ప్రేక్షకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా టోన్ మారినప్పటికీ, కథనం చాలా వరకు ఊహకు అందేలా, ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ఫ్లాట్‌గా సాగిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. కథలో విలన్ ట్రాక్ బలంగా లేకపోవడం వల్ల ఆశించినంత బిగువు లోపించిందని, సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల ఎమోషన్స్‌ను సరిగ్గా పండించలేకపోయిందని పెదవి విరుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే, ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఒడిదుడుకులను పక్కన పెడితే.. వినోదాత్మకమైన ఫస్ట్ హాఫ్, సమంత స్టైలిష్ పర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి ఒకసారి చూడదగ్గ 'యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్' గా ఈ చిత్రం నిలిచిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.