
దిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపును తెలియజేసే జాతీయ డిజిటల్ రిజిస్టరు ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషనుపై స్పందనలు తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తదితరాలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
నమోదైన ప్రతి న్యాయవాదికి ఒక యూనిక్ జాతీయ అడ్వొకేట్ గుర్తింపును అందించి నకిలీ న్యాయవాదుల్ని నిరోధించాలని బీఏఐ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. పిటిషనరు ఆలోచన సరికొత్తగా ఉందని, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ చర్యలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
1961 నాటి న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ 49 కింద న్యాయవాదుల కోసం సోషల్ మీడియా, డిజిటల్ ప్రవర్తనా నియమావళిని రూపొందించేలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేయాలని కూడా బీఏఐ సుప్రీంకోర్టును కోరింది. పిటిషనరు తరఫున న్యాయవాదులు విపిన్ నాయర్, ప్రశాంత్ కుమార్ వాదనలు వినిపించారు.
యువ న్యాయవాదుల్ని బలోపేతం చేయాలని, వారిని ప్రోత్సహించాలని విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిజిటల్ వేదికలపై కొందరు చట్టం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నది తమ దృష్టికి వచ్చిందన్నారు. న్యాయవాదులు బాధ్యతగా ప్రవర్తించాలని, ముందుగా వృత్తిపరమైన నైతిక నియమావళిని నేర్చుకొని దానికి కట్టుబడాలని సూచించారు.
ఈ విచారణను జులై నెలకు వాయిదా వేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర