ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొలది, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం పట్ల ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, దీనికోసం ఖరీదైన సప్లిమెంట్లు, ప్రత్యేకమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మన వంటగదిలో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.ప్రముఖ న్యూట్రిషన్, వెల్నెస్ నిపుణురాలు సోనియా నారంగ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఒక వీడియోలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, పండ్లలో అత్యధిక ప్రోటీన్ జామకాయలో లభిస్తుండగా, కూరగాయల్లో పచ్చి బఠానీలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక కప్పు జామకాయ ముక్కల్లో దాదాపు 4.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని, అలాగే ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠానీలలో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని ఆమె వివరించారు.వీటితో పాటు ప్రొటీన్ పుష్కలంగా ఉండే మరికొన్ని సాధారణ ఆహార పదార్థాలను కూడా ఆమె సూచించారు.
పప్పుధాన్యాలలో మినప పప్పు, శనగపిండి (బేసన్), గింజల రకాల్లో గుమ్మడి గింజలు, నట్స్‌లో వేరుశనగలను ఉత్తమ ఎంపికలుగా పేర్కొన్నారు. ఖరీదైన ప్రోటీన్ పౌడర్లపై ఆధారపడకుండా, నిత్యం ఇంట్లో అందుబాటులో ఉండే ఈ పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని ఆమె తెలిపారు.ఈ ఆహార పదార్థాలు ప్రొటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి.
అయితే, ప్రతి ఒక్కరి శారీరక అవసరాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి, ఆహార ప్రణాళికలో మార్పులు చేసే ముందు వైద్యులను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం
.