
Rythu Bharosa : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులను వారంరోజుల్లో విడుదల చేస్తామని తొలుత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 30వ తేదీన ఖమ్మం జిల్లాలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. ఆ సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. పలు ప్రాంతాల్లో విత్తనాలు విత్తుతున్నారు. దీంతో రైతులకు పంట సాగు ప్రారంభ సమయంలో ఖర్చుల నిమిత్తం రైతుభరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం కింద ప్రతీయేటా రెండు విడుతల్లో ఎకరానికి ప్రభుత్వం రూ.12వేలు జమ చేస్తోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది. రైతు భరోసా పథకం కింద ఎన్ని ఎకరాలకు నిధులు జమ చేస్తుందనే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు.
గత యాసంగి సీజన్లో విడుతల వారిగా మూడు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో మూడు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు ఒకేసారి జమ చేస్తారా.. లేదంటే తొలుత ఎకరం కలిగిన రైతులకు..
ఆ తరువాత మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సిందే. వాస్తవానికి ఐదెకరాలలోపు రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే విషయంపై రైతుల్లో ఆందోళన
నెలకొంది.
మరోవైపు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో రూ. 2వేలు చొప్పున నగదు జమ కానుంది. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 రోజుల తేడాతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నాయి.