
పచ్చిమిర్చి మొక్కను పెంచడం కోసం ఇదే సరైన సమయం. వానకాలం ఆరంభంలోనే విత్తనాలు నాటితే అవి మొలకెత్తే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యకరమైన మొక్కకు మంచి విత్తనాలు చాలా ముఖ్యం. ఇందుకోసం నర్సరీ నుండి పచ్చిమిర్చి విత్తనాలను కొనవచ్చు లేదా ఇంట్లో ఎండు మిరపకాయల నుండి కూడా విత్తనాలను తీయవచ్చు.
చిన్న కంటైనర్లో మట్టి నింపి విత్తనాలను నాటాలి. మట్టి తేమగా ఉండేలా చూసుకోండి. సుమారు 5-7 రోజుల్లో చిన్న మొక్కలు రావడం మొదలవుతుంది. పచ్చిమిర్చి మొక్క వేర్లు బాగా లోతుగా వెళితే మొక్క బలంగా ఉంటుంది. ఇందుకోసం కనీసం 12 అంగుళాల లోతు ఉన్న కుండీని తీసుకోవాలి.
దాన్ని కేవలం మట్టితో నింపకుండా 50 శాతం గార్డెన్ మట్టి, 30 శాతం వర్మీకంపోస్ట్, పశువుల ఎరువు, 20 శాతం ఇసుక లేదా కోకోపీట్ తీసుకోని... అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమం మట్టిని తేలికగా, గాలి ఆడేలా, పోషకాలతో నింపుతుంది. దీంతో మొక్క వేగంగా పెరుగుతుంది.
మొక్కలు మొలిచాక 4 నుంచి 5 అంగుళాల పొడవు పెరిగాక, వాటిని పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. మొక్కలు తీసేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఒక కుండీలో ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే నాటాలి. అప్పుడే వాటికి తగినంత స్థలం, పోషణ లభిస్తుంది.
పచ్చిమిర్చి మొక్కకు రోజూ కనీసం 5-6 గంటల ఎండ అవసరం. బాల్కనీ, టెర్రస్ లేదా ఎండ తగిలే కిటికీ దీనికి ఉత్తమమైన ప్రదేశం. ఎండ సరిగా తగలకపోతే పూలు రాలిపోయి కాయలు కాయవు. కుండీలోని మట్టిని ఎప్పుడూ తేమగా ఉంచండి. కానీ అవసరానికి మించి మాత్రం నీళ్లు పోయవద్దు.
ఎక్కువ నీటి వల్ల వేర్లు కుళ్లిపోవచ్చు. మట్టి మరీ పొడిగా ఉంటే మొక్క బలహీనపడుతుంది. మట్టి పై పొర పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. మొక్క కొంచెం పెద్దయ్యాక, దాని పై భాగాన్ని (టాప్ గ్రోయింగ్ టిప్) తేలికగా తుంచండి.
దీనివల్ల
మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చి పూలు, మిరపకాయల సంఖ్య పెరుగుతుంది. మిరప మొక్కలకు ఆకు ముడత, ఇతర కీటకాల సమస్యలు రావచ్చు. వారానికి ఒకసారి వేప నూనె స్ప్రే చేయండి. అలాగే పుల్లటి మజ్జిగను నీళ్లలో కలిపి స్ప్రే చేయవచ్చు. అరటిపండు, గుడ్డు తొక్కల నీటిని పోయడం ద్వారా కూడా మిరపకాయలు బాగా కాసేలా చేసుకోవచ్చు.