
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై బీజేపీ ఏపీ శ్రేణులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్...
పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ప్రత్యేక నమోదు స్టాల్‌ను అధికారికంగా ప్రారంభించారు.రూ.750లకే 15 లక్షల ప్రమాద బీమా:ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రధానమంత్రి మోదీ అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు.
చౌకగా, అతి తక్కువ ప్రీమియంతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా లైఫ్ ఇన్సూరెన్స్ (జీవిత బీమా) పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. కేవలం రూ. 750 చెల్లిస్తే చాలు.. ఏకంగా రూ. 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని వివరించారు.
అలాగే పోస్టల్ ఆఫీసుల ద్వారా మరెక్కడా లేనంత అత్యధిక వడ్డీ ఇచ్చే పలు పొదుపు పథకాలను మోదీ ప్రభుత్వం సమర్థంగా చేపడుతోందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ లబ్ధిని ప్రజల ముంగిటకే తీసుకెళ్లేందుకు తాము ప్లాన్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ఈ స్కీమ్స్‌లో ప్రజలు సులభంగా చేరేందుకు వీలుగా అన్ని నగరాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఈ దేశాభివృద్ధి యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మాధవ్ పిలుపునిచ్చారు
.