
మాట్లాడుతున్న ఏఐజీ ఆసుపత్రి కార్డియాక్, ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగం డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సి.నరసింహన్. చిత్రంలో డా.సచిన్, డా.సి.
శ్రీదేవి
గచ్చిబౌలి, న్యూస్టుడే: మారిన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గుండె లయ తప్పి ప్రాణాంతకంగా మారే ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అనే సమస్యకు ఏఐజీలో సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ సమస్యతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడికి అత్యంత అధునాతన పీఎఫ్ఏ (పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్) విధానంతో విజయవంతంగా చికిత్స అందించినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెడ్ట్రానిక్ సంస్థ భాగస్వామ్యంతో బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి కార్డియాక్, ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగం డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సి.నరసింహన్, సీనియర్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ డా.సచిన్ యలగుడ్రి, డాక్టర్ సి.శ్రీదేవిలతో కలిసి వివరాలు వెల్లడించారు.
ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో గుండె లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరికి పక్షవాతం ముప్పు 5 రెట్లు, మరణం ముప్పు 3 రెట్లు, డిమెన్షియా ముప్పు 2 రెట్లు అధికం. భారత్లో దాదాపు 40% మంది రోగుల్లో గుండె కవాటాల సమస్యతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సంభవిస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం.. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం ఈ వ్యాధికి కారణం అవుతున్నాయి. పీఎఫ్ఏ చికిత్సలో చాలా ఎక్కువ వోల్టేజ్ విద్యుత్తు తరంగాలను మిల్లీసెకన్ల పాటు గుండె భాగంలోకి పంపుతారు. కణజాలాలకు నష్టం జరగకుండా, కేవలం దడకు కారణమయ్యే కణాలను ఈ తరంగాలు సరి చేస్తాయి. అక్కడి రక్తనాళాలు, కణజాలం దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువ. చికిత్స జరిగిన లేదా మరుసటి రోజు రోగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.