తోటపని చేసే చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు కలుపు మొక్కలు, గొంగళి పురుగులు లేదా ఫంగల్ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటారు కానీ చెదపురుగులు సమస్య మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక దుంగను లేదా పూల కుండీని పైకి లేపినప్పుడు దాని కింద నేలపై తెల్లటి చీమల్లాంటి జీవులు తిరుగుతూ ఉండటం గమనించి ఉంటాం కదా అవే చెదపురుగులు.
సడెన్గా చూసినప్పుడు భయపడటం సహజం, ఎందుకంటే అవి తోటను నాశనం చేస్తాయేమో లేదా ఇంట్లోకి ప్రవేశిస్తాయనే భయం మొదలవుతుంది. అయితే కొన్ని చెదపురుగులు మనకు మేలు చేసేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఎండిన చెట్లను కుళ్లింపజేసి నేలలోకి పోషకాలను విడుదల చేయడం ద్వారా ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ అద్భుతమైన రీసైక్లర్లుగా పనిచేస్తాయి.
కానీ వీటి సంఖ్య బాగా పెరిగినప్పుడు లేదా తోటలోని బాగున్న చెట్లను, ఇతర చెక్క భాగాలను తినడం ప్రారంభించినప్పుడే అసలు సమస్య మొదలవుతుందని రీసెర్చ్గేట్ అధ్యయనం పేర్కొంది. ప్రతిసారీ ప్రమాదమనే భావన వద్దుసాధారణంగా చెదపురుగులు కనిపించాయి అంటేనే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందనేది ఒక సాధారణ అపోహ.
వాస్తవానికి చాలా రకాల చెదపురుగులు కేవలం చనిపోయిన లేదా కుళ్లిపోతున్న చెక్కను మాత్రమే తింటాయి. ప్రకృతిలో పోషకాల పునరుత్పత్తికి చెదపురుగులు ఎంతగానో తోడ్పడుతాయి. అయోవా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొన్నట్లుగా కూలిపోయిన చెట్లను, మొద్దులను కుళ్లింపజేయడంలో సహాయపడటం ద్వారా ఇవి ప్రకృతిలో కీలక పాత్ర పోషిస్తాయి.
కాబట్టి చెదపురుగులు కనిపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ చెట్ల కాండాలపై మట్టి సొరంగాలు ఏర్పడటం, కొమ్మలు లోపల గుల్లబారిపోవడం, చెట్లు బలహీనపడటం, ఆ చెదలు కంచెలకు పాకడం వంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తం కావాలి.
చెదపురుగులకు ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి చేరుకుంటాయి. తోటల్లో ఉండే చెక్క మొద్దులు, కుళ్లిపోతున్న వేళ్లు, విరిగిపడిన కొమ్మలు, పాత చెక్క పలకలు, తడి ఆకుల కుప్పలు చెదపురుగులను అమితంగా
ఆకర్షిస్తాయి. చాలా మంది ఇంటి యజమానులు తమకు తెలియకుండానే తమ తోటల్లో వీటికి అనుకూలమైన పెంపక కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు తోటను శుభ్రం చేస్తూ ఉండాలి. అయితే తోటను శుభ్రం చేయడం అంటే జీవం లేకుండా మార్చడం కాదు. మొక్కలు ఉన్న పాంత్రాల్లో అనవసరంగా పేరుకుపోయిన కుళ్లిన చెక్కలను తొలగించడం. పాత ఎండిన మొద్దు తొలగించడం వల్ల శుభ్రంగా ఉన్న తోటల్లో ఆహారం సులభంగా దొరకదు కాబట్టి చెదపురుగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తేమను గమనించాలి చెదపురుగులకు చెక్క ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ తేమ అవసరం. సరైన నీటి పారుదల లేని తోటలు లేదా లీకేజీలు ఉన్న నీటి వ్యవస్థల వల్ల నేల ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది చెదపురుగులు కాలనీలు హాయిగా జీవించడానికి సరైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే వాటర్ లీకేజీలను అరికట్టాలి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఇంటిని చెదపురుగుల నుంచి రక్షించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తాం కానీ తోటలోని చెట్ల గురించి పట్టించుకోము. చెదపురుగులు చెట్టును లోపలి నుంచి సులభంగా నాశనం చేయగలవు. కొన్ని సార్లు చెట్టు పైకి బాగానే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చెదలు దాని నిర్మాణాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మొక్కల చుట్టూ నేలలో తేమను నిలిపి ఉంచడానికి మట్టి నాణ్యతను పెంచడానికి మొక్కల చుట్టూ ఆకులు లేదా చెక్క పొట్టును పరుస్తారు. అయితే ఇది చెదపురుగులను ఆకర్షించి వాటికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ సమస్య మల్చింగ్ చేయడంలో లేదు ఆ మల్చింగ్ను ఎక్కువ కాలం తడిగా ఉంచడం లేదా మొక్కల కాండానికి ఆనుకుని దాన్ని వేయడంలో ఉంది. కాబట్టి మొక్క కాండానికి, మల్చింగ్కు మధ్య కొంత స్థలాన్ని వదలడం వల్ల అక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవచ్చు. తోటలోని జీవవైవిధ్యం తనను తాను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. పక్షులు, కొన్ని రకాల చీమలు, కీటకాలు, నెమటోడ్లు చెదపురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ సహజ శత్రువులు తోటలోని చెదపురుగుల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయినా వాటి సంఖ్యను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. జీవవైవిధ్యం ఎక్కువగా ఉండే తోటల్లో ఇలాంటి తెగుళ్ల ఉధృతి చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.