యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న ఒక ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. బ్యాంకులో ఖాతా ప్రారంభించిన రెండు నెలలు కూడా గడవకముందే ఆయన ఏకంగా 2 మిలియన్ దిర్హామ్‌ల (భారత కరెన్సీలో సుమారు రూ.5.15 కోట్లు) భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నాడు.
అబుదాబిలో నివసిస్తున్న 34 ఏళ్ల షజీర్ వెంగా ఈ బంపర్ ప్రైజ్ విజేతగా నిలిచాడు.షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (ఎస్ఐబీ) తన వినియోగదారుల కోసం ఏటా నిర్వహించే 'మిలియనీర్ క్యాంపెయిన్'లో భాగంగా, జూన్ నెలకు సంబంధించి నిర్వహించిన డ్రాలో షజీర్‌ను విజేతగా ప్రకటించారు. కేవలం రెండు నెలల క్రితమే షజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా తెరిచాడు.
బ్యాంకు నిబంధనల ప్రకారం, ఖాతాలో జమ చేసే ప్రతి 10,000 దిర్హామ్‌ల డిపాజిట్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఖాతాదారులలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది.ఈ విజయంపై షజీర్ వెంగా హర్షం వ్యక్తం చేశాడు.
ఈ బహుమతి తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పుతుందని, గెలుచుకున్న సొమ్ముతో భారతదేశంలో ఉన్న తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకువస్తానని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకున్న నాటి నుండి, ఎప్పటికైనా విజేతగా నిలవాలనే ఆశతో ఇందులో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ డ్రాలో షజీర్తో పాటు మరికొందరు నగదు బహుమతులను, ఒక లగ్జరీ కారును కూడా గెలుచుకున్నారు
.