
Kia Sonet : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా భారత్‌లోని పబ్లిక్ రోడ్లపై సరికొత్త కియా సోనెట్ ప్రయోగాత్మక పరీక్షలు చేస్తూ కెమెరా కంటికి చిక్కింది.
అయితే.. పూర్తిగా కనిపించకుండా కవర్ చేసినప్పటికీ ఈ కారుకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్ 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. టెస్టింగ్ చేస్తున్న కారును గమనిస్తే, దీని డిజైన్‌లో కియా గ్లోబల్ ఎస్‌యూవీల శైలి స్పష్టంగా కనిపిస్తోంది.
కారు ముందు భాగంలో నిలువుగా ఉండే వర్టికల్ హెడ్‌ల్యాంప్స్ , ఆకర్షణీయమైన బూమరాంగ్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఫ్రంట్ గ్రిల్ పరిమాణం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తున్నా, ఫ్రంట్ బంపర్ మాత్రం మరింత రగ్గడ్ , షార్ప్ లుక్‌తో ఉండనుంది.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది మొదటి జనరేషన్ 'సెల్టోస్' లో కనిపించిన తరహా అల్లాయ్ వీల్స్‌తో పాటు రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్ , ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ సరికొత్త సోనెట్ లోపలి భాగంలో సాంకేతికత పరంగా భారీ అప్డేట్స్ ఉండనున్నాయి.
కారు విండ్‌షీల్డ్ గుండా చూసినప్పుడు ఇందులో 12.3 ఇంచుల ట్విన్ స్క్రీన్లతో కూడిన ఒక పెద్ద కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ ఉన్నట్లు అర్థమవుతోంది. కియా ఇటీవలే లాంచ్ చేసిన 'సైరోస్' ఎస్‌యూవీలో కూడా ఇలాంటి సెటప్‌నే అందించారు. ప్రీమియం మెటీరియల్స్, అధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్ కూడా ఈ కారులో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పెరగనున్న లెగ్‌రూమ్.. సేఫ్టీలో 5-స్టార్ టార్గెట్ ప్రస్తుత సోనెట్ కారులో వెనుక సీట్లో కూర్చునే వారికి లెగ్‌రూమ్ లేదా స్పేస్ కొంచెం తక్కువగా ఉంటుందనే
ఫిర్యాదు ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కియా ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను తమ సరికొత్త 'K1 ఆర్కిటెక్చర్' ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తోంది. దీనివల్ల కారు వీల్‌బేస్ పెరిగి, వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మంచి స్పేస్ దొరుకుతుంది. అంతేకాకుండా, ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ వల్ల భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ తీసుకురావడమే లక్ష్యంగా కియా పనిచేస్తోంది.
ప్రస్తుతానికి ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ , 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లనే మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్లతో కొనసాగించనున్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కియా ఈ కారులో 'స్ట్రాంగ్-హైబ్రిడ్' పవర్‌ట్రెయిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. 2027లో ఈ కొత్త మోడల్ లాంచ్ అయిన తర్వాత, బహుశా 2028-29 నాటికి దీని హైబ్రిడ్ వెర్షన్ కూడా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ప్లాట్‌ఫారమ్ , సరికొత్త టెక్నాలజీ కారణంగా రాబోయే కియా సోనెట్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.