
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధంలో తాము ఏఐ టూల్ ‘గ్రోక్ (Grok)’ను వినియోగించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ సాంకేతికతను ఉపయోగించి 2వేల టార్గెట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన ‘ఎక్స్ఏఐ’ కంపెనీపై నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా పెంటగాన్ ఈవిషయాన్ని వెల్లడించింది.
‘ఎక్స్ఏఐ’ కంపెనీ తమ అతిపెద్ద డేటా సెంటర్ల కోసం గ్యాస్ టర్బైన్లను వినియోగించడంపై ఓ పౌరహక్కుల సంస్థ కోర్టులో దావా వేసింది. ఈ టర్బైన్ల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని ఆరోపించింది. ఈ కేసుపై తాజాగా కోర్టులో విచారణ జరగ్గా..
మస్క్ కంపెనీని అమెరికా న్యాయశాఖ సమర్థించింది. ‘‘దేశ మిలిటరీ ఆపరేషన్లలో ఈ కంపెనీ కృత్రిమ మేధ ఆవిష్కరణలు కీలకంగా పనిచేస్తున్నాయి. మన దేశ జాతీయ భద్రతకు సహకరించే అతికొద్ది శక్తిమంతమైన ఏఐల్లో గ్రోక్ ఒకటి. అలాంటి కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయడం అంటే..
అమెరికా జాతీయ, ఆర్థిక, ఇంధన భద్రతకు ముప్పు తీసుకురావడమే’’ అని న్యాయశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా పెంటగాన్ ఏఐ చీఫ్ కామెరూన్ స్టాన్లీ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. ‘‘ప్రాజెక్ట్ మావెన్లో భాగంగా గ్రోక్‌ను యుద్ధ ఆపరేషన్లలో వినియోగిస్తున్నాం.
మావెన్ స్మార్ట్ వ్యవస్థ ఆధారంగా ఇటీవల ఇరాన్ (Iran)లో కేవలం 96 గంటల్లోనే 2,000 లక్ష్యాలపై 2,000 ఆయుధాలతో విరుచుకుపడి వాటిని పూర్తిగా ధ్వంసం చేయగలిగాం. గ్రోక్ సమర్థత వల్లే ఇది సాధ్యమైంది’’ అని స్టాన్లీ వెల్లడించారు. ప్రాజెక్ట్ మావెన్ కోసం అమెరికా రక్షణశాఖ తొలుత ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌తో జట్టు కట్టింది.
అయితే, నిఘా విషయంలో ఈ రెండింటి మధ్య విభేదాలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంథ్రోపిక్‌తో కాంట్రాక్టులను ట్రంప్ సర్కారు రద్దు చేసుకుంది. అనంతరం ఏఐ సాంకేతికత కోసం ఎక్స్ఏఐ సంస్థతో కలిసి పనిచేస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని ప్రకటనలు