
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Zozila Tunnel Records: హిమాలయ పర్వత సానువులు.. మంచుకొండల్లో ఎముకలు కొరికే చలి… మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు… యేడాది పొడువునా భారీగా మంచుకురిసే ప్రాంతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో బయటి ప్రపంచంతో సంబంధంలేని పరిస్థితి ఉండేది.
ఇలా ఆరు నెలలపాటు రోడ్డు రవాణా స్తంభించిపోయేది. ఆరు నెలలపాటు మాత్రమే రాకపోకలు సాగేవి. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ - లడ్డాఖ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీంతో ఇపుడు జమ్మూకాశ్మీర్ - లడ్డాఖ్ ప్రాంతాన్ని అనుసంధానం చేసే చారిత్రక సొరంగమార్గం అందుబాటులోకి వచ్చింది.
ఇకనుంచి యేడాది పొడువునా.. రోడ్డు రవాణాకు ఎలాంటి ఢోకాలేకుండా పోయింది. నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలతో అలజడిరేపే జమ్మూకాశ్మీర్ ప్రాంతం ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. రూపురేఖల్లోనూ చారిత్రక మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల చీనాబ్ రైలు వంతెన అందుబాటులోకి వచ్చింది.
దీంతో సంవత్సరం పొడవునా రైలు రవాణా వ్యవస్థ సాగే విధంగా మార్పు జరిగింది. ఇది దేశానికి వ్యూహాత్మకంగా, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తోంది. సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో నిరంతర రవాణా.. ఇపుడు తాజాగా రోడ్డు రవాణా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా జొజిలా సొరంగం అద్భుతాన్ని ఆవిష్కరించింది.
భారీ హిమపాతంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఇపుడు కనుమరుగైపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకుని అన్నికాలాల్లో రవాణా సౌకర్యానికి అనువుగా జొజిలా సొరంగం మార్గం అందుబాటులోకి వచ్చేసింది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల
ఎత్తులో ఉన్న ఈ సొరంగం, భారతదేశ పర్వత మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత ముఖ్యమైన ఇంజనీరింగ్ విజయాలలో ఒకటిగా నిలిచింది.
జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
హిమాలయ పర్వత సానువుల్లో 13 కిలోమీటర్లకుపైగా ఉన్న జొజిలా సొరంగ మార్గం కాశ్మీర్ లోయను లడ్డాఖ్‌లోని కార్గిల్‌తో అనుసంధానం చేసింది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు రూ. 6,500 కోట్ల వ్యయంతో ఈ సొరంగ మార్గాన్ని పూర్తిచేసింది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన గడ్కరీ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో జోజిలా సొరంగం మార్గం వద్దకు చేరుకున్న మంత్రి నితన్ గడ్కరీ ఉన్నతాధికారులతో కలిసి సొరంగమార్గంలో ప్రయాణించారు.
గుర్రపునాడా ఆకారంలో ఉండే ఈ ఏక-గొట్టపు సొరంగం 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు, 13 కిలోమీటర్ల పొడవు ఉంది. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతోమంది తెలుగు ఇంజినీర్లు, నిపుణులు పాలుపంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజులపాటు మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుపానులను తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రతి మీటరు తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారినప్పటికీ అనుభవం ఉన్న నిపుణులు అవరోధాలు, సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు. ఇది పూర్తి కావడంతో జోజిలా సొరంగ మార్గంలో ప్రయాణ సమయం సుమారు 90 నిమిషాల నుండి కేవలం 15 నిమిషాలకు తగ్గిపోయింది. ఈమార్గం ద్వారా అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన బల్తాల్‌కు ప్రవేశానికి అనువుగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు.
మేఘా ఇంజినీరింగ్ అద్భుతం.. జమ్మూకాశ్మీర్, లడ్డాఖ్ ప్రాంతాల మధ్య వాతావరణ పరిస్థితులతో రోడ్డు మార్గాలు మూసేసేవారు.స్తంభించిన రవాణా వ్యవస్థతో సాయుధదళాలు, సామాన్యప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది. దీంతో జమ్ముకాశ్మీర్ లోని సోనామార్గ్ - లద్దాఖ్ లోని ద్రాస్, కార్గిల్ ప్రాంతాలను అనుసంధానించే విధంగా జొజిలా సొరంగమార్గం చేపట్టారు. జొజిలా సొరంగంతో రవాణా వ్యవస్థకు ఢోకాలేకుండా పోతుందని ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 13కిలోమీటర్లకు పైబడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది.
జొజిలా సొరంగ మార్గం పనులను 2020 అక్టోబరు 15 తేదీన లాంఛనంగా ప్రారంభించారు. 2028 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. సొరంగ మార్గం పూర్తయితే శ్రీనగర్ - లేహ్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గించి, ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యం నెరవేరింది. ప్రధాన సొరంగం బాల్టాల్లోని పశ్చిమ ముఖద్వారం వద్ద ప్రారంభమై, మీనామార్గ్లోని తూర్పు ముఖద్వారం వద్ద ముగుస్తుంది. అత్యంత క్లిష్టమైన భూభాగంలో భూగర్భ పనుల యొక్క అత్యంత కీలకమైన దశ విజయవంతంగా పూర్తయింది.
జోజిలా సొరంగాన్ని న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మించారు. ఈ పద్ధతి, ముఖ్యంగా పెళుసైన హిమాలయ భూగర్భ నిర్మాణానికి, మారుతున్న రాతి పరిస్థితులకు చాలా అనువైనది. NATM పద్ధతిలో క్రమబద్ధమైన తవ్వకం, షాట్‌క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి తక్షణ సహాయక చర్యలు, నిరంతర జియోటెక్నికల్ పర్యవేక్షణలో పనులు సాగాయి. సొరంగం తవ్వకం సమయంలో మారుతున్న భూగర్భ పరిస్థితులకు ఇంజనీర్లు అనువుగా స్పందించి రేయంబవళ్లు పనులు పూర్తిచేశారు. భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన భూగర్భ వాతావరణాలలో ఒకటైన ఈ సొరంగంలో స్థిరత్వం, భద్రత, నిర్మాణ పురోగతిని కొనసాగించడంలో ఈ విధానం కీలక పాత్ర పోషించింది.
ఇపుడు అందుబాటులోకి వచ్చిన జోజిలా సొరంగమార్గం సాయుధ దళాలకు, ప్రజారవాణాకు అనువుగా మారింది. శ్రీనగర్-లేహ్ రహదారి, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన దళాలతో సహా, లడ్డాఖ్లో ఉన్న సాయుధ దళాలకు ఇది ప్రధాన సరఫరా మార్గంగా నిలిచింది. సైనిక మోహరింపులను కొనసాగించడానికి, పరికరాలను తరలించడానికి, ముందు వరుస ప్రాంతాలకు వేగంగా బలగాలను పంపడానికి, జోజిలా సొరంగం ద్వారా నిరంతరం ప్రయాణాలు సాగించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.