
ఏసీబీ నమోదు చేసిన డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్ (DA) కేసు ఆధారంగా నరహరికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఛత్రినాకలోని ప్రధాన నివాసంతో పాటు నారాయణగూడలోని కార్యాలయం సహా మొత్తం 11 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.
సోదాల కోసం పలువురు అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం. సోదాల సందర్భంగా నరహరి నివాసంలో భారీగా నగదు గుర్తించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంట్లోని ఒక కబోర్డులో రూ.1.54 కోట్ల నగదు దొరికింది. అంతేకాకుండా సుమారు కిలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా రూ.1 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ప్రభుత్వ విలువ ప్రకారం ఆస్తులు రూ.5 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే మార్కెట్ ధరల ప్రకారం ఈ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. నరహరి కుటుంబ సభ్యుల పేర్లపై కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. సోదాల సమయంలో రెండు బ్యాంక్ లాకర్ల వివరాలు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చాయి.
వాటిని తెరిచి పరిశీలించేందుకు సంబంధిత బ్యాంకులకు అధికారులు లేఖలు పంపారు. బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించి పూర్తి ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
సోదాల్లో లభించిన ఆధారాల నేపథ్యంలో సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం అక్రమ ఆస్తుల విలువ, వాటి స్వభావం, తదుపరి చర్యలపై అధికారిక రిపోర్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.
.
రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల్లో ఇది ఇటీవల కాలంలో అత్యంత కీలక ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తున్నారు