హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేపట్టే క్రమంలో కొన్ని పాత నిర్మాణాలకు మార్పులు చేర్పులు చేయడం అనివార్యమవుతోంది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రత కోసం నిర్మించిన ప్రతిష్టాత్మక ఉప్పల్ స్కైవాక్‌కు ఇప్పుడు కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో గండం ఎదురైంది.
కారిడార్‌కు సంబంధించిన భారీ పిల్లర్ల నిర్మాణానికి స్కైవాక్ అడ్డుగా మారడంతో.. దాన్ని ఒక వైపు తాత్కాలికంగా ముక్కలుగా తొలగించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) అధికారులు సిద్ధమవుతున్నారు.గతంలో ఉప్పల్ క్రాస్‌రోడ్డు దాటాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
దీనికి పరిష్కారంగా 2020లో రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో 660 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, 6 మెట్ల మార్గాలతో ఈ స్కైవాక్ పనులు ప్రారంభించి 2023లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. భూమి నుంచి 6 మీటర్ల క్లియరెన్స్ ఉండే ఈ స్కైవాక్ పాదచారులకు ఎంతో సౌకర్యంగా మారింది.
అయితే, తాజాగా ఉప్పల్ రింగురోడ్డు మీదుగా నిర్మిస్తున్న కొత్త ఎలివేటెడ్ కారిడార్ ఈ స్కైవాక్‌తో పాటు దానిపై నుంచి వెళ్లే మెట్రో రైలు లైన్‌ను కూడా దాటాల్సి ఉంది. అందువల్ల ఈ కారిడార్‌ను భూమి నుంచి గరిష్ఠంగా 23 మీటర్ల ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు.ఇంత భారీ ఎత్తున ఉండే ఫ్లై ఓవర్‌ను మోయడానికి ఉప్పల్ జంక్షన్ వద్ద భారీ పిల్లర్లను నిర్మించాల్సి వస్తోంది.
ఈ క్రమంలో వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్లే స్కైవాక్ పిల్లర్ నంబర్ 23 ఏ నుంచి 24 వరకు ఉన్న దాదాపు 17 మీటర్ల మేర స్కైవాక్ భాగాన్ని తక్షణమే తొలగించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తొలగింపు పనులు, పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ స్కైవాక్‌ను యథావిధిగా అమర్చడానికి అయ్యే అంచనా వ్యయాన్ని లెక్కించే బాధ్యతను ఒక ప్రైవేట్
కన్సల్టెన్సీకి అప్పగించారు. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం కన్సల్టెన్సీ ప్రతినిధులు మంగళవారం ఉప్పల్‌కు రానున్నారు.ఈ నిర్మాణాల కారణంగా రానున్న కొన్ని నెలల పాటు వరంగల్ రహదారి వైపు ఉన్న స్కైవాక్ మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. దీనివల్ల కాలినడకన ప్రయాణించే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కాగా.. ఈ తాత్కాలిక తొలగింపు, పునర్నిర్మాణ ప్రక్రియకు అయ్యే పూర్తి ఖర్చును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భరించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.