ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరో ఏడాది పాటూ వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు.
అంటే శని, ఆదివారాలు వారికి సెలవు.. ఐదు రోజులు మాత్రమే విధుల్లో ఉంటారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2027 జూన్ వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సచివాలయం, హెచ్వోడీల్లో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేశారు.
రాజధాని పరిధిలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యం కోసం 2016 మే నెల నుంచి పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు తగ్గించింది. అప్పటి (గత తొమ్మిదేళ్ల) నుంచి ఏటా ఈ సౌకర్యాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నెల 27వ తేదీతో వారంలో ఐదు రోజుల పనిదినాల గడువు ముగుస్తోంది.
దీంతో మరోసారి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, హెచ్వోడీలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించారు.వారంలో ఐదు రోజుల పనిదినాలను మరోసారి పొడిగించాలని ఉద్యోగులు కోరారు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల రిక్వెస్ట్‌తో 2027 జూన్ వరకూ వారంలో ఐదు రోజుల పనిదినాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉద్యోగులు కచ్చితంగా ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధులు నిర్వర్తించాలన్న నిబంధనను మాత్రం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
మొత్తం మీద అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఊరట దక్కింది.. వారంలో ఐదు రోజుల పనిదినాలు మరో వారం పాటూ పొడిగించారు.ఏపీ సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల కోసం గతంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు
ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రైలును కూడా నడుపుతోంది. కేంద్ర సహకారంతో ఈ రైలు ఇప్పటికీ కొనసాగుతోంది. చాలామంది ఉద్యోగులు ఈ రైలులో అమరావతికి వచ్చి వెళుతున్నారు. అందుకే ఈ రైలును ఎంప్లాయిస్ రైలుగా పిలుస్తుంటారు. ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 4.40 గంటలకు లింగంపల్లిలో బయల్దేరుతుంది, బేగంపేట, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, మంగళగిరి మీదుగా విజయవాడకు ఉదయం 10.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట మీదుగా లింగంపల్లికి రాత్రి 11.35 గంటలకు చేరుకుంటుంది.