
Anand Mahindra : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే చాలు.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన షేర్ చేసే ట్రావెల్ పోస్టులు చూస్తే, "ఇంత అందమైన ప్రదేశం ఇండియాలో ఉందా? దీని గురించి మనకు ఇప్పటివరకు ఎందుకు తెలియదు?" అనిపించక మానదు.
తాజాగా ఆయన కర్ణాటక తీరంలోని 'హొన్నావర్' (Honnavar) అనే ఒక ప్రశాంతమైన పట్టణం గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. సాధారణంగా హాలిడే ప్లాన్ అనగానే అందరికీ గోవా, కూర్గ్ లేదా కేరళ బ్యాక్‌వాటర్స్ గుర్తుకొస్తాయి.
కానీ 'హొన్నావర్' అనే పేరు చాలా మంది వినను కూడా లేదు. జనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా, అద్భుతమైన ప్రకృతి అందాలతో ఉన్న ప్రదేశాలను అన్వేషించే క్రమంలో తనకు ఈ ప్లేస్ దొరికిందని ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫోటోలను షేర్ చేశారు.
"మనం ఎప్పుడూ కేరళ బ్యాక్‌వాటర్స్ గురించే గొప్పగా చెప్పుకుంటాం. కానీ కర్ణాటక తీరంలో అంతకంటే అందమైన, సమానమైన గుర్తింపు రావాల్సిన ఒక దాగి ఉన్న అద్భుతం ఈ హొన్నావర్" అని మహీంద్రా రాసుకొచ్చారు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, అందమైన జలపాతాలలో ఒకటైన 'జోగ్ ఫాల్స్' అందరికీ తెలిసే ఉంటుంది.
ఈ జలపాతానికి కారణమైన 'శరవతి నది' తన ఉధృతినంతా ముగించుకుని, చివరకు ప్రశాంతంగా సాగుతూ ఈ హొన్నావర్ వద్దకు వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన మడ అడవులు (Mangrove forests), అద్దంలా మెరిసిపోయే ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, మలుపులు తిరిగే నీటి మార్గాలు ఈ ప్రాంతాన్ని ఒక మాయా ప్రపంచంలా మార్చేశాయని మహీంద్రా కొనియాడారు.
ఆయన షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే ఇక్కడికి వెళ్లాల్సిందే అనేలా ఉన్నాయి. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్ అయిన వెంటనే, గతంలో హొన్నావర్ సందర్శించిన కొందరు పర్యాటకులు తమ అనుభవాలను
, ఫోటోలను కామెంట్లలో పంచుకోవడం ప్రారంభించారు. పక్క రాష్ట్రాల టూరిజం హడావుడిలో కర్ణాటకలోని ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు వెనకబడిపోతున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంత అందమైన ప్లేస్ అసలు జనాలు లేకుండా, కమర్షియల్ కాకుండా ఎలా ఉండిపోయిందో అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఊదరగొట్టే పబ్లిసిటీతో ఉండే టూరిస్ట్ ప్లేస్‌ల వెనుక పరిగెత్తే కంటే, ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలు ఎంతో మేలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ చర్చతో పాటు దేశంలోని మరికొన్ని అన్వేషించని అందమైన ప్రదేశాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల (North East) లోని కొన్ని లొకేషన్ల గురించి జనాలు చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం అందరి ఫోకస్ హొన్నావర్ పైనే ఉంది. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు, గంటల తరబడి క్యూ లైన్లు, వ్యూ పాయింట్ల దగ్గర జనాల తోపులాటలు లేకుండా.. కేవలం నది, అడవి, పచ్చటి ప్రకృతి, సముద్రం మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. టూరిస్టుల రద్దీతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ నలిగిపోతున్న ఈ రోజుల్లో హొన్నావర్ లాంటి ప్రదేశాలు నిజంగా పీస్ ఫుల్ మైండ్ కోరుకునే వారికి ఒక వరం. ఆనంద్ మహీంద్రా పోస్ట్ తర్వాత ఈ చిన్న పట్టణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మరి ఈ క్రేజ్ తర్వాత కూడా హొన్నావర్ ఇలాగే ప్రశాంతంగా ఉంటుందో లేదో చూడాలి.
అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.