
టీవీల్లో చాలా రకాల మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. సైజ్, ఫిక్చర్ క్వాలిటీ, డిజైన్, సౌండ్ ఇలా రకరకాల ఫీచర్లను బట్టి వాటి ధరల్లో భారీ తేడాలు కూడా ఉంటున్నాయి. కొంతమంది లక్షలు పోసి కూడా టీవీలు కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక చిన్న టీవీ కొనాలంటే కనీసం రూ.10 వేలు కావాల్సిందే.
అయితే ఎక్కువ మంది రూ.25 నుంచి 40 వేల మధ్య ధర ఉన్న టీవీలను ఎక్కువగా కొంటున్నారు. ఇంత డబ్బు పోసి కొంటున్నారు కానీ టీవీ ఎంత కాలం పనిచేస్తుందనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. కొత్త టీవీ కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మంది స్క్రీన్ సైజు, పిక్చర్ క్వాలిటీ, సౌండ్, స్మార్ట్ ఫీచర్లపైనే దృష్టి పెడతారు.
కానీ టీవీ ఎంతకాలం మన్నుతుంది? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అనే ప్రశ్న మాత్రం చాలా తక్కువ మంది అమ్మకందారులను అడుగుతారు. వాస్తవానికి టీవీలకు మందులు లేదా ఆహార పదార్థాల మాదిరిగా ఎక్స్పైరీ డేట్ ఉండదు. అయితే ప్రతి టీవీకి ఒక పరిమిత లైఫ్ టైమ్ మాత్రం ఉంటుంది.
టీవీ లైఫ్ టైమ్ నిర్ణయించడంలో ప్రధాన పాత్ర డిస్ప్లేదే. LED, OLED, Mini LED వంటి టెక్నాలజీల ఆధారంగా పనితీరు మారుతుంది. కొన్ని OLED ప్యానెల్లు 1 లక్ష గంటల వరకు పనిచేయగలవని తయారీ సంస్థలు చెబుతున్నప్పటికీ, వాస్తవ జీవితంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
రోజుకు సగటున 6 గంటలు టీవీ చూస్తే సిద్ధాంతపరంగా అది దశాబ్దాల పాటు పనిచేయగలదు. అయితే విద్యుత్ హెచ్చుతగ్గులు, దుమ్ము, వేడి, తేమ, అంతర్గత ఎలక్ట్రానిక్ భాగాల అరుగుదల వంటి అంశాలు టీవీ లైఫ్ టైమ్‌ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం సాధారణ పరిస్థితుల్లో చాలా టీవీలు 7 నుంచి 10 సంవత్సరాల వరకు సమర్థంగా పనిచేస్తాయి.
ఆ తర్వాత పవర్ సప్లై, మదర్బోర్డ్, బ్యాక్‌లైట్ వంటి భాగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది
. OLED టీవీల్లో ‘బర్న్-ఇన్’ అనే సమస్య కనిపించవచ్చు. ఒకే లోగో లేదా చిత్రం ఎక్కువసేపు స్క్రీన్‌పై కనిపిస్తే దాని ముద్ర శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు LED టీవీలు సాధారణంగా ఎక్కువ మన్నికగా భావించినప్పటికీ, వాటిలోని బ్యాక్‌లైట్ కాలక్రమేణా బలహీనపడుతుంది. దీంతో స్క్రీన్‌పై నల్లటి మచ్చలు, అసమాన కాంతి, ప్రకాశం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాక్‌లైట్ పూర్తిగా పనిచేయకపోవచ్చు.
టీవీ పాతబడుతున్న సంకేతాలు కూడా స్పష్టంగానే కనిపిస్తాయి. స్క్రీన్ ప్రకాశం తగ్గిపోవడం, రంగులు మసకబారడం, తెలుపు రంగు పసుపు లేదా నీలి ఛాయలో కనిపించడం వంటి లక్షణాలు డిస్ప్లే అరిగిపోతున్నట్లు సూచిస్తాయి. అదేవిధంగా స్మార్ట్ టీవీలకు కొన్ని సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్లు ఆగిపోవడం వల్ల యాప్‌లు సరిగా పనిచేయకపోవడం, పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి టీవీకి నిర్దిష్ట గడువు తేదీ లేకపోయినా, దాని పనితీరు శాశ్వతం కాదు. సరైన నిర్వహణ, విద్యుత్ రక్షణ పరికరాల వినియోగం, దుమ్ము, తేమ నుంచి కాపాడటం ద్వారా టీవీ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. అయినప్పటికీ కాలక్రమేణా నాణ్యత తగ్గడం అనేది సహజ ప్రక్రియగానే మిగులుతుంది.