
భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పూర్తిగా కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 20 తేదీల మధ్య వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతోంది.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌తో పాటు జిల్లాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం, మున్సిపల్ శాఖ, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. రోడ్లు, వంతెనలు, కల్వర్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో వర్షాల సమయంలో వేగంగా స్పందించేందుకు హైడ్రా బైక్ టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి. పెద్ద వాహనాలు చేరలేని ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 20 ప్రత్యేక బైక్‌లతో 60 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెట్లు కూలిపోవడం, రోడ్లపై అవరోధాలు ఏర్పడటం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితుల్లో ఈ బృందాలు వెంటనే స్పందిస్తున్నాయి. ఇటీవల నగరంలో వర్షాల కారణంగా వందల సంఖ్యలో చెట్లు కూలిపోగా, హైడ్రా బృందాలు వాటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించాయి.
భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యమవడంతో పాటు కొన్ని విమానాలను ఇతర నగరాలకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా వాతావరణ ప్రభావం రవాణా వ్యవస్థపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నందున రైతులు, ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో నీరు