గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు.. దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు విస్తరించాయి. పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ .. ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ సహా చాలా మంది పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలపై, రాజకీయ నేతలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీట్, సీబీఎస్ఈ సహా పలు ఎగ్జామ్ పేపర్ లీక్స్ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతారాహిత్యం కారణంగా.. దేశ రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. గతంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే అప్పటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి బాధ్యత వహించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అలాంటి మహానేతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు రాజకీయాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు పెరిగాయని అడిగితే తాను ఉల్లిగడ్డలు తిననని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మన దేశంలో గతంతో పోలిస్తే
.. రాజకీయ నాయకులు ఎలా మారిపోయారు అనేదానిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన పిట్టకథ.. అక్కడ ఉన్న వారందరినీ చప్పట్లు కొట్టించింది. 40 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయి నరకానికి వెళ్తే.. ఆయనకు యమధర్మరాజు పూలమాలవేసి స్వాగతం పలికి.. ఇంద్రుడి వద్దకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆ నేతను ఇంద్రుడికి.. యముడు పరిచయం చేస్తూ భారత్కు చెందిన గొప్ప నేత అని చెప్పి అప్పగించారని.. ఆ తర్వాత 20 ఏళ్ల క్రితం మరో నేత చనిపోయి నరకానికి వెళ్తే.. యముడు నరకం బయటి వచ్చి అటువెళ్తే స్వర్గం వస్తుందని.. అక్కడికి వెళ్లి ఇంద్రుడికి చెప్పండి అన్నారని చెప్పారు. ఇక ఇటీవలి కాలంలో ఇంకో రాజకీయ నేత చనిపోతే.. యముడు సింహాసనం మీది నుంచి కూడా లేవకుండా.. అలా నేరుగా వెళ్తే స్వర్గం వస్తుందని చెబుతారని వివరించారు. అది చూసి యముడి పక్కనే ఉండే చిత్రగుప్తుడు ఆశ్చర్యపోయిన.. గతంలో ఒక వ్యక్తి వస్తే.. స్వయంగా ఇంద్రుడి వద్దకు తీసుకెళ్లారని.. ఆ తర్వాత బయటికి వచ్చి అడ్రస్ చెప్పారని.. కానీ ఇప్పుడు కనీసం సింహాసనం మీది నుంచి కూడా లేవలేదని యముడిని చిత్రగుప్తుడు అడిగారని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. అయితే అందుకు సమాధానమిచ్చిన యముడు.. తాను సింహాసనం మీది నుంచి లేస్తే ఆ రాజకీయ నాయకుడు వచ్చి తన సీటుపై కూర్చుంటారని నవ్వుతూ చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ చెప్పగానే అక్కడ ఉన్న యువత మొత్తం గట్టిగా చప్పట్లు కొట్టారు. మరోవైపు.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని ప్రొఫెసర్ నాగేశ్వర్ గుర్తు చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనమ్ వాంగ్చుక్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి అవరని సెటైర్లు గుప్పించారు. ఇలా మంత్రి రాజీనామా చేస్తే ప్రజలకు జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత వస్తుందని పేర్కొన్నారు. చిలీ దేశంలో మెట్రో ఛార్జీలు 30 పైసలు పెంచితే 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు గల టీనేజీ యువత ప్రారంభించిన పోరాటం.. చివరికి అక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు వెళ్లిందని గుర్తు చేశారు. సోషల్ మీడియాను, రాజకీయ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉంచుకుంటుంది కానీ.. దేశ ప్రజలు ఆగ్రహిస్తే దేశంలో కాక్రోచ్ ఉద్యమరూపం దాల్చిందని పేర్కొన్నారు. అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆకాంక్షించారు.దేశంలో ఇంత అవినీతి జరిగినా.. తప్పిదాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఏ ఒక్కరు కూడా జవాబుదారీతనం ఉండరా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ నిలదీశారు. కనీసం ఉద్యమం తీవ్రతరం అయినా కూడా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. దేశంలో 20 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. ప్రధాని మోదీ చెప్పిన 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చుతామని.. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని దేశ యూత్ అడుగుతున్నారని పేర్కొన్నారు. పరాన్నజీవులుగా బతకాలని తాము అనుకోవడం లేదని.. కష్టపడి పనిచేసే కాక్రోచ్లం అని యూత్ చెబుతున్నాని తెలిపారు. ఉద్యోగాలు అడిగితే సమాధానం చెప్పే వ్యక్తి లేరని.. నిర్బయ నుంచి దిశ లాంటి ఎన్నో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తే.. అంత రాత్రిపూట ఆడవాళ్లు ఎందుకు బయటికి వెళ్లారు.. అలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకున్నారని ప్రశ్నిస్తారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలను, దేశంలోని అవినీతిని, పాలనలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే తనను అర్బన్ నక్సలైట్ అని అంటున్నారని.. చైనా, పాకిస్తాన్ ఏజెంట్ అంటారని.. దేశద్రోహి అంటారని.. ఇలాంటి ఎన్ని మాటలు తమను అన్నప్పటికీ.. తాము పట్టించుకోమని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చి చెప్పారు. తాము భారతమాత ముద్దుబిడ్డలమని.. భగత్ సింగ్ తమ్ముళ్లమని.. అందుకే భారత్ మాతాజీ జై అని గట్టిగా నినదిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. వీధుల్లోకి వచ్చి ప్రత్యక్ష పోరాటాలకు దిగారని తెలిపారు. సోషల్ మీడియాతో పాటు బయటికి వచ్చి పోరాటం చేస్తే విజయం సాధిస్తారని తేల్చి చెప్పారు.