వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం మలయాళ చిత్రసీమలో సహజ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు షేన్ నిగమ్ . ఈరోజు మలయాళ ప్రేక్షకులు థియేటర్లలో అతడిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అంటే, ఆ క్రేజ్ వెనుక ఒక సగటు యువకుడి కన్నీళ్లు, పోరాటం, పట్టుదల దాగి ఉన్నాయి. ఒకదశలో కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందనుకున్న చోటు నుంచే, తన అద్భుతమైన టాలెంట్‌తో తిరిగి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న షేన్ జీవిత ప్రయాణం ఏ సినిమా కథకూ తీసిపోదు.* అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో – ఐశ్వర్య రాజేష్ విజయాల వేళ ఊహించని దెబ్బచాలామంది నటుల జీవితాలు విజయాలతో మొదలై వివాదాలతో ముగుస్తాయి. కానీ షేన్ నిగమ్ కథ వేరు. కెరీర్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటున్న తరుణంలోనే విధి అతడిని దారుణంగా దెబ్బకొట్టింది. 2017లో అతడి తండ్రి, కేరళలో మిమిక్రీ రారాజుగా పేరొందిన ప్రముఖ నటుడు కళాభవన్ అబీ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొచ్చిలోని ఎలమక్కర వీధుల్లో చిన్నప్పటి నుంచి తండ్రి వేసే స్టేజ్ షోలను, కెమెరా వెనుక ఆయన పడే తపనను చూస్తూ పెరిగిన షేన్‌కు, తండ్రే సర్వస్వం. మార్గదర్శిని కోల్పోయిన ఆ తీవ్ర విషాదం నుండి కోలుకోవడం షేన్‌కు అంత సులభం కాలేదు. కష్టాలు అక్కడితో ఆగలేదు. తండ్రి మరణం సృష్టించిన శూన్యం నుండి బయటపడకముందే, సినీ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలతో వచ్చిన తీవ్రమైన విభేదాలు అతడిని చుట్టుముట్టాయి. మీడియాలో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. మానసిక ఒత్తిడి నరకాన్ని చూపించింది. దీంతో "ఈ కుర్రాడి కెరీర్ ఇక్కడితో క్లోజ్" అని పరిశ్రమ వర్గాలు సైతం పెదవి విరిచాయి. వివాదాల సుడిగుండంలో చిక్కుకుని, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఆ
చీకటి రోజుల్లో షేన్ నమ్ముకున్న ఒకే ఒక్క ఆయుధం 'నటన'. వెండితెరపై సంచలనంఒక నటుడిని వివాదాలు కుంగదీయవచ్చు కానీ, అతడిలోని ప్రతిభను ఏ శక్తీ ఆపలేదు. 2019లో వచ్చిన ‘కుంబళంగి నైట్స్’ చిత్రం షేన్ నిగమ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు, మలయాళ సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అందులో ‘బాబీ’ అనే బాధ్యతారహితమైన వ్యక్తిగా, జీవితాన్ని వెతుక్కునే ఒక సగటు యువకుడిగా షేన్ పండించిన హావభావాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. అంతకుముందు 2016లో వచ్చిన ‘కిస్మత్’ చిత్రంతోనే హీరోగా తనలోని అసలైన నటుడిని పరిచయం చేసిన షేన్, ఆ తర్వాత ‘పరవ’, ‘ఈడ’ వంటి చిత్రాలతో వైవిధ్యాన్ని చాటుకుంటూ వచ్చాడు. వివాదాల అనంతరం వచ్చిన ‘భూతకాలం’ చిత్రంలో భయం, ఒంటరితనం, మానసిక సంఘర్షణను షేన్ పండించిన తీరు చూసి విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆ వెంటనే వచ్చిన ‘ఆర్డీఎక్స్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అతడిని కమర్షియల్ స్టార్‌గా మార్చేసింది. పడిపోయిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం షేన్‌కు అలవాటుగా మారింది.* రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్! బాలనటుడి నుండి టాలీవుడ్ ఎంట్రీ వరకు..చిన్నతనంలోనే ఇంజినీరింగ్ పుస్తకాల కంటే కెమెరా లెన్స్‌ను ఎక్కువగా ప్రేమించిన షేన్, 2010లో ‘తంతోన్ని’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘అన్నయుం రసూలుం’, ‘కమ్మట్టిపాడం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటనలోని మెళకువలను నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వైవిధ్యమైన నటుడు సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే విడుదలైన ‘దృఢం’ సినిమాలో విజయ్ రాధాకృష్ణన్ అనే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించాడు. అందులో ఆయన సెటిల్డ్ నటన, ఎక్స్ప్రెషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రావడంతో షేన్ నిగన్ నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దులు దాటి టాలీవుడ్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు షేన్ నిగమ్ సిద్ధమయ్యాడు. ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ఆయన ప్రొఫెషనల్ రేసర్ పాత్రను పోషిస్తున్నాడు. 'డిజే టిల్లు', 'జెర్సీ', 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాగర్ ఉదగండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన పాత్రకు న్యాయం చేయడం కోసం షేన్ నిగమ్ తెలుగు భాషను నేర్చుకుంటూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కష్టాల సుడిగుండాలు, విషాదాలను దాటుకుని స్వయంకృషితో నేడు పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్న షేన్ నిగమ్ సినీ ప్రయాణం నిజంగా అద్భుతం, ఎందరికో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.