తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలల కిందట రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో చాలా మంది పోటీలో నిలిచారు. కానీ అందులో కొందరే గెలిచి.. పదవులను చేపట్టగా.. మిగిలిన వారు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకూడదు అనే నిబంధన ఉంది. అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ కొందరు ఎన్నికల్లో బరిలో దిగుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిపోతే అటు పదవితోపాటు.. ఇటు ప్రభుత్వ ఉద్యోగం కూడా పోతుంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందికి.. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుడ్న్యూస్ చెప్పారు. వారిని పునర్నియమించేందుకు అవకాశం కల్పించనున్నారు. మంత్రి సీతక్క చొరవతో అర్హులైన వారు విధుల్లోకి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి.. తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజీనామా చేసిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ స్థానంలో.. ఇప్పటివరకు ఇంకో అభ్యర్థిని నియమించని ప్రాంతాల్లో మాత్రమే తిరిగి పాత వారిని నియమించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సిబ్బంది సంక్షేమానికి రేవంత్ రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అర్హులైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి అభ్యర్థనలతోపాటు.. రూల్స్ ప్రకారం వెంటనే వాటిని పరిశీలించి వారిని పునర్నియమించనున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో రాజీనామా చేసిన
అంగన్వాడీ సిబ్బందిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.