
ఇంటర్నెట్ డెస్క్: చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా సంబంధిత సమాచారాన్ని చైనా పౌరులు తమకు సురక్షితంగా చేరవేసేందుకు వీలుగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తైవాన్ నిఘా సంస్థ తెలిపింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలు అనుసరించే విధానాల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తైవాన్ అధికారులు తెలిపారు. ‘‘ఇటీవల చైనా (China) ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. రాజకీయ నియంత్రణ కఠినంగా కొనసాగుతోంది. సామాజిక, జీవనోపాధి సమస్యలు తీవ్రమయ్యాయి. ఇవన్నీ చైనీయుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ పరిణామాల నడుమ వివిధ రకాల సమాచారాన్ని పంచుకుంటామంటూ చైనా నుంచి తైవాన్‌లోని సంస్థలను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనా పౌరులు గూఢచర్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వెబ్‌పేజీని ప్రారంభిస్తున్నాం’’ అని తైవాన్ (Taiwan) జాతీయ భద్రతా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తైవాన్ విషయంలో చైనా కూడా ఈ తరహా ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు గతంలో తెలిపింది. వేర్పాటువాదులను జవాబుదారీగా ఉంచడమే లక్ష్యంగా.. తైవాన్ స్వాతంత్ర్య కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరింది. గతేడాది అమెరికా సైతం చైనా విషయంలో ఇదే తరహా చర్యలు తీసుకుంది. అసంతృప్తితో ఉన్న చైనా అధికారులు సమాచారాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తూ సీఐఏ సోషల్ మీడియాలో మాండరిన్ భాషలో వీడియోలను విడుదల చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.