
న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో సాకర్ సమరం పీక్స్‌కు చేరింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా బ్రెజిల్, మొరాకో జట్ల మధ్య జరిగిన పోరు ఫుట్ బాల్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినీషియస్ జూనియర్ కొట్టిన అదిరిపోయే గోల్ స్టేడియంను హోరెత్తించింది. అయితే, గ్రౌండ్లో వినీషియస్ చేసిన మ్యాజిక్ ఒకెత్తయితే, స్టాండ్స్‌లో అమెరికన్ రాపర్ ట్రావిస్ స్కాట్ చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ్యాచ్ ఆరంభం నుంచే మొరాకో గట్టి పోటీ ఇచ్చింది. ఆట 21వ నిమిషంలోనే మొరాకో గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లడంతో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో బ్రెజిల్ కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. సరిగ్గా 32వ నిమిషంలో వినీషియస్ జూనియర్ తన వ్యక్తిగత నైపుణ్యంతో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు. కార్లో అన్సెలోట్టి శిక్షణలోని బ్రెజిల్ జట్టుకు ఈ గోల్ కొత్త ఊపిరిని ఇచ్చింది. వినీషియస్ గోల్ కొట్టిన వెంటనే స్టేడియం మొత్తం కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఫేమస్ రాపర్ ట్రావిస్ స్కాట్ ఆనందానికి అవధుల్లేవు. గోల్ పడగానే ఆయన గాల్లోకి ఎగురుతూ చిన్నపిల్లాడిలా సెలబ్రేట్ చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ క్రేజీ సెలబ్రేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వినీషియస్ పెర్ఫార్మెన్స్కు రాపర్ ఫిదా అయిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ వినీషియస్ జూనియర్ కెరీర్లో చాలా స్పెషల్. బ్రెజిల్ జాతీయ జట్టు తరపున ఇది అతనికి 50వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ గోల్‌తో బ్రెజిల్ తరపున తన 10వ గోల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఇది అతనికి రెండో గోల్. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో సౌత్ కొరియాతో జరిగిన
నాకౌట్ మ్యాచ్‌లో వినీషియస్ తన మొదటి వరల్డ్ కప్ గోల్ సాధించాడు. ఇప్పుడు మరోసారి కీలక సమయంలో గోల్ చేసి జట్టును ఆదుకున్నాడు.
ప్రస్తుతం వరల్డ్ ఫుట్‌బాల్‌లో వినీషియస్ జూనియర్ ఒక సెన్సేషన్. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున అదరగొడుతున్న ఈ స్టార్ ప్లేయర్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్‌పై కూడా బ్రెజిల్ తరపున బిగ్ మ్యాచ్ విన్నర్‌గా మారుతున్నాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని గోల్స్ చేయడంలో వినీషియస్ దిట్ట అని మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్ చూసిన అభిమానులు అంతా "వినీ ఈజ్ ఆన్ ఫైర్" అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.