
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో నభా ఘటన ఒక చిన్న ఎపిసోడ్‌లా కనిపించినా.. నేటి రాజకీయ, మాధ్యమ వాదోపవాదాల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అకాలీ ఉద్యమం, బ్రిటిష్ పాలకులు, పంజాబ్ సంస్థాన రాజకీయాలు.. ఇవన్నీ కలిసిన సంక్లిష్ట నేపథ్యాన్ని, అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు, న్యాయపరమైన రికార్డులు, సిక్కు, అకాలీ వర్గాల వృత్తాంతాలు, నెహ్రూ స్వీయ రచనలు, ఆధునిక మీడియా విశ్లేషణల ఆధారంగా సమగ్రంగా పరిశీలించడం అవసరం. 1923 ప్రాంతంలో పంజాబ్‌లోని నభా సంస్థానంలో మహారాజా రిపుదమన్ సింగ్, పొరుగు పటియాలా మహారాజా భూపిందర్ సింగ్ మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ విభేదాల్లో బ్రిటిష్ ప్రభుత్వ జోక్యం పెరిగి, చివరకు రిపుదమన్ సింగ్‌ను రాజీనామా చేయించడంలో ముగిసింది. ఈ సమయంలో పంజాబ్‌లో అకాలీ ఉద్యమం.. గురుద్వారాల నిర్వహణపై బ్రిటిష్ సంస్థాన పాలకుల నియంత్రణకు వ్యతిరేకంగా ఉధృతమవుతోంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ (ఎస్జీపీసీ), అకాలీ దళ్ వంటి సంస్థలు నభా మహారాజా పునరుద్ధరణ, గురుద్వారా స్వాతంత్ర్యం కోసం జైతో మోర్చా వంటి ఆందోళనలను చేపట్టాయి. ఈ అకాలీ సిక్కు ఉద్యమానికి మద్దతుగా భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, . గిద్వాని, సంతానం తదితరులు జైతో ప్రాంతానికి జథాగా వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఇదే వారి అరెస్టు, నభా జైలు శిక్షకు దారితీసిన సంఘటనల శ్రేణికి ప్రారంభ బిందువు. 1923లో నభా రాష్ట్రంలో నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నాయకులు అనధికార ప్రవేశం, రాజకీయ ఆందోళనలకు మద్దతు ఇచ్చినందుకు అరెస్టు అయ్యారు. నెహ్రూ తన ఆత్మకథలో ఈ ఘటనను ఒక విచిత్రమైన, అనూహ్యమైన అనుభవంగా పేర్కొంటూ.. నభా విచారణలో తాను రక్షణ వాదనలు వినిపించలేదని, బ్రిటిష్ ప్రభుత్వ విచారణలలో సాక్ష్యాలు సమర్పించడం తమ రాజకీయ ధోరణికి విరుద్ధమని స్పష్టంగా రాశారు. నెహ్రూ, గిద్వాని, సంతానం
మొదట చిన్న శిక్షలు, తరువాత రెండున్నర సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యారు. నభా జైలు పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, ఆహారం, ఆరోగ్య, సంచార స్వేచ్ఛ పరిమితమైందని నెహ్రూ స్వయంగా పేర్కొన్నారు. సిక్కు, అకాలీ వర్గాల చరిత్ర రచయిత సోహన్ సింగ్ జోష్ అకాలీ మోర్చియాన్ దా ఇతి హాస్ (1972) లో నభా ఫైల్ ఆధారంగా ఒక కీలక అంశాన్ని ప్రస్తావిస్తారు: 1923 సెప్టెంబర్ 23న మోతీలాల్ నెహ్రూ వైస్రాయ్‌కు టెలిగ్రామ్ పంపి, తన కుమారుడిని కలవడానికి నభాకు వస్తున్నట్లు తెలియజేశారు. దీనిపై నభా అడ్మినిస్ట్రేటర్ విల్సన్ మరియు భారత ప్రభుత్వం మధ్య ఏడు టెలిగ్రామ్‌లు మార్పిడి అయ్యాయని, శిక్షను విధించేటప్పుడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలి, తిరిగి రావద్దు అనే షరతు పెట్టాలా అనే చర్చ జరిగినట్లు జోష్ రికార్డు చేస్తారు. 1923 అక్టోబర్–1924 మే మధ్యకాలంలో నెహ్రూ విడుదలపై షరతులతో విడుదల అనే ప్రచారం వెలువడింది. నభా అడ్మినిస్ట్రేటర్ విల్సన్ మహాత్మా గాంధీకి 1924 మే 22న రాసిన లేఖలో నెహ్రూ నభా రాష్ట్రంలో తిరిగి ప్రవేశించబోమని అంగీకరించినందువల్లే విడుదలయ్యారు అని పేర్కొన్నట్లు జోష్ పుస్తకంలో ఉంది.
బ్రిటిష్ కాలంలో రాజకీయ ఖైదీలు, సంస్థానాల్లో నిర్బంధితులు తమ శిక్షను తగ్గించుకోవడానికి లేదా విడుదల కోసం పిటిషన్, క్లెమెన్సీ పిటిషన్ వంటి న్యాయపరమైన మార్గాలను ఉపయోగించడం సాధారణం. వీటిని నేటి బెయిల్, రిట్ పిటిషన్ లాంటి న్యాయ సాధనాలతో పోల్చవచ్చు. ఆధునిక చర్చల్లో, ముఖ్యంగా సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లపై రాజకీయ వాదోపవాదాల సమయంలో.. కొందరు రచయితలు, వక్తలు జవహర్లాల్ నెహ్రూ నభా జైలు నుంచి బయటపడేందుకు తన తండ్రి మోతీలాల్ నెహ్రూ ద్వారా క్షమాభిక్ష పిటిషన్ రాయించుకున్నారు, బాండ్‌పై సంతకం చేశారు.. అనే వాదనను ముందుకు తెచ్చారు. చరిత్రకారుడు విక్రమ్ సంపత్.. , 1923 నభా ఘటన సందర్భంలో మోతీలాల్ నెహ్రూ వైస్రాయ్‌కు పిటిషన్ పంపినట్లు, తన కుమారుడు ఇకపై నభా రాష్ట్రంలోకి ప్రవేశించబోరని బాండ్ ఇచ్చినట్లు పేర్కొంటారు.
ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. సిక్కు, అకాలీ మూలాలు, నభా ఫైల్ ఆధారంగా, మోతీలాల్ నెహ్రూ వైస్రాయ్‌కు టెలిగ్రామ్ పంపినట్లు, నభా అడ్మినిస్ట్రేటర్ షరతులతో విడుదలకు ప్రయత్నించినట్లు.. కానీ చివరకు భారత ప్రభుత్వం షరతులతో విడుదల వైపు మొగ్గుచూపినట్లు సూచిస్తాయి. అంటే.. మోతీలాల్ నెహ్రూ వైస్రాయ్‌కు పిటిషన్ టెలిగ్రామ్ పంపిన అంశం చారిత్రక రికార్డుల్లో కనిపించినా, జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిగతంగా మాఫీనామా రాశారు, బాండ్‌పై సంతకం చేశారు అనే వాదనకు నెహ్రూ స్వీయ రచనలు, అకాలీ మూలాలు, నభా ఫైల్ వివరాలు ప్రత్యక్ష ఆధారాన్ని ఇవ్వవు. ఇది పిటిషన్ అనే సాధారణ న్యాయ ప్రక్రియను రాజకీయంగా విస్తరించి, కౌవర్డ్, మాఫీనామా అనే లేబుల్గా మార్చిన తర్వాతి కాలపు రాజకీయ నిర్మాణం అని చెప్పవచ్చు.
సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లపై విమర్శలు పెరిగిన తర్వాత, కొన్ని వర్గాలు నెహ్రూ కూడా క్షమాభిక్ష పిటిషన్ రాశారు, బాండ్ ఇచ్చారు అనే వాదనను సోషల్ మీడియా, టెలివిజన్ డిబేట్లలో విస్తృతంగా ప్రచారం చేశాయి. దీని ద్వారా సావర్కర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం; కాంగ్రెస్ నాయకులు కూడా అదే చేశారు అనే రాజకీయ సమీకరణను నిర్మించడానికి ప్రయత్నం జరిగింది.
అయితే.. సిక్కు –అకాలీ రచయితలు నభా ఘటనను ప్రధానంగా జైతో మోర్చా, గురుద్వారా సంస్కరణ, సంస్థాన రాజకీయాలు అనే కోణంలో చూస్తారు. నెహ్రూ విడుదలపై వారు ఇచ్చిన వివరాలు, విడుదల ఆదేశాలు పై స్థాయి ప్రభుత్వ నిర్ణయంతో వచ్చాయి. విల్సన్ షరతులు పెట్టాలని కోరుకున్నా, భారత ప్రభుత్వం షరతులేని విడుదల వైపు వెళ్లింది అనే దిశలో ఉన్నాయి.
సావర్కర్, నెహ్రూ, ఇతర నాయకుల క్షమాభిక్ష పిటిషన్లపై నేటి రాజకీయ తీర్పులు, అప్పటి జైలు పరిస్థితులు, న్యాయపరమైన సాధనాలు, వ్యక్తిగత, రాజకీయ బాధ్యతల సంక్లిష్టతను విస్మరిస్తున్నాయి. మాఫీనామా రాశారా–రాయలేదా? అనే ప్రశ్నకు బదులుగా.. అప్పటి పరిస్థితుల్లో పిటిషన్ అనే న్యాయ సాధనం ఎలా ఉపయోగించబడింది? ఎవరు ఎలాంటి షరతులు అంగీకరించారు? ఎవరు బహిరంగంగా ఖండించారు? అనే సూక్ష్మ విశ్లేషణ అవసరం.
నభా మహారాజా రాజీనామా, జైతో మోర్చా, అకాలీ ఉద్యమం, నెహ్రూ అరెస్టు–విడుదల ఇవన్నీ కూడా సిక్కు రాజకీయాల్లో, గురుద్వారా సంస్కరణల్లో, బ్రిటిష్, సంస్థాన సంబంధాల్లో దీర్ఘకాల ప్రభావం చూపాయి. నభా ఘటనను కేవలం నెహ్రూ మాఫీనామా అనే చిన్న కోణంలో మాత్రమే చూడడం, ఈ విస్తృత చారిత్రక ప్రభావాన్ని నీరుగార్చే ప్రమాదం ఉంది.
నెహ్రూ ఆత్మకథ, నభా ఫైల్, అకాలీ మూలాలు, ఆధునిక విశ్లేషణలను సమగ్రంగా చదవడం.. రాజకీయ కన్వీనియెన్స్ కోసం వాస్తవాలను వక్రీకరించకుండా, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం (calling a spade a spade), మూలాలను యథాతథంగా ప్రతిబింబించడం పిటిషన్ అనే న్యాయపరమైన సాధనాన్ని కౌవర్డ్ మాఫీనామా గా లేబుల్ చేయాలా, లేక సాధారణ న్యాయ ప్రక్రియ గా చూడాలా అనే ప్రశ్నను పాఠకుల ముందుంచి, వారు స్వయంగా నిర్ణయం తీసుకునేలా చేయడం.
బాపట్ల విద్యా, వైద్య వికాస మార్గదర్శి, సేవా దార్శనికుడు డాక్టర్ యార్లగడ్డ శ్రీ కృష్ణమూర్తి
.