
విజయవాడ ఎంపీ చిన్ని ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు విజయవాడ (పటమట), న్యూస్‌టుడే: మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడలో కేసు నమోదైంది. కేశినేని నానితోపాటు అతని అనుచరులు సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ.. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘గత ఏడాది ఏప్రిల్ 22న కేశినేని నాని తన ఫేస్బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తూ నాపై పలు అసత్య ఆరోపణలు చేశారు. ఉర్సా సంస్థతో నాకు సంబంధాలున్నట్లు, బినామీల ద్వారా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయమై గత ఏడాది ఏప్రిల్ 24న లీగల్ నోటీస్ పంపినా.. తగిన వివరణ ఇవ్వలేదు. పదేపదే నాపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా వాటిని తొలగించలేదు. ఆరోపణలను ఉపసంహరించుకోలేదు. నా రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేశినేని శ్రీనివాస్ (నాని)తో పాటు అతని అనుచరులపై ఐటీ చట్టంలోని 66, 66-సీ, 66-డీ, 67, 72 సెక్షన్లతో పాటు బీఎన్ఎస్లోని 204, 351(1), 352, 353(1), 61(1), 356(1) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. నాని పీఏగా వ్యవహరించిన హేమంత్‌ను శనివారం పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి
తావు లేదు.