
కొద్దిపాటి వర్షాలకే నగరాలను ముంచెత్తుతున్న ముంపు నీరు ప్రతిబంధకంగా కాలువల ఆక్రమణలు పేరుకుపోతున్న పూడికలు వర్షాలు తీవ్రమయ్యే లోపు నివారణ చర్యలు తీసుకుంటే మేలు విజయవాడలో ఇటీవల కురిసిన వర్షానికి ఆటోనగర్ పీఅండ్‌టీ కాలనీలో పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. 24 గంటల వరకు అదే పరిస్థితి. ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ఈనాడు, అమరావతి - యంత్రాంగం: వర్షాకాలం మొదలైనా.. పలు నగరపాలక సంస్థల్లో వరద నీటి సమస్య పరిష్కార చర్యలు అంతంతమాత్రంగా ఉన్నాయి. డ్రెయిన్ల ఆక్రమణలు, పూడిక తొలగించకపోవడం, ఏటా పెరుగుతున్న వరద నీటి ఉద్ధృతికి అనుగుణంగా కాలువలను విస్తరించకపోవడంతో పలు నగరాలు ఏటా ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థల్లో చిన్న, పెద్ద వర్షపునీటి కాలువలు 24,053 కిలోమీటర్ల మేర ఉన్నాయి. మరో 23,611 కి.మీ. కొత్తగా నిర్మించాలి. పుర, నగరపాలక సంస్థల్లో నిధుల కొరతతో అన్ని పనులూ ఒకేసారి చేపట్టే అవకాశం లేదు. దశల వారీగా నిర్మించినా.. కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కాకినాడ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై, లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు రోజుల కొద్దీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విజయవాడ భవానీపురంలో అసంపూర్తిగా వరదనీటి కాలువ నిర్మాణ పనులు సమస్య: అసంపూర్తిగా నిలిచిన వరదనీటి కాలువలతో వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. 2017లో తెదేపా ప్రభుత్వం రూ.461 కోట్లతో 440 కి.మీ. పొడవైన కాలువల నిర్మాణ పనులను ప్రారంభించింది. రూ.172 కోట్ల వ్యయంతో 250 కి.మీ. మేర పనులు పూర్తయ్యాక.. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. పరిష్కారం ఇలా: పెండింగ్‌లో ఉన్న 190 కి.మీ. కాలువల నిర్మాణం పూర్తికి సవరించిన రూ.280 కోట్ల అంచనాలను ప్రభుత్వం ఆమోదించాలి. సీఆర్డీఏ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేయించాలన్న ప్రతిపాదననైనా పరిశీలించాలి. సమస్య: ఈ నగరం గుండా వెళ్లే
14 పంట కాలువలు ఒకప్పుడు 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో ఉండేవి. అక్రమణలతో అవి సగానికి కుచించుకుపోయాయి. దీంతో అయ్యప్పగుడి, టీచర్స్ కాలనీ, తల్పగిరి, ఆర్టీసీ కాలనీలు, వైఎస్సార్, పరమేశ్వర్, మనమసు నగర్లు, ఇరగాలమ్మ సంగం, సాయినగర్, పొర్లుకట్ట, జయలలిత నగర్, ఈద్గామిట్ట తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
పరిష్కారం ఇలా: కాలువల ఆక్రమణలను ఇప్పటికే సర్వే చేసి గుర్తించారు. వాటి తొలగింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు ప్రారంభించి, నిలిపివేస్తున్నారు. ఆక్రమణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే.. సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది.
సమస్య: పీకలవాగు, అంబేడ్కర్ వాగుల్లో పూడిక పేరుకుపోవడం, ఆక్రమణలతో వరద నీరు వెనక్కి వచ్చి కాలనీలను ముంచెత్తుతోంది. ఏటీ అగ్రహారం, మురికిపేట తదితర చోట్ల డ్రెయిన్ల నిర్మాణంలో ప్రణాళికా లోపంతో ముంపు సమస్య తలెత్తుతోంది. నల్లపాడు డ్రెయినుకు రక్షణ గోడ పూర్తిగా నిర్మించకపోవడంతో ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది.
పరిష్కారం ఇలా: పీకలవాగులో 13 కి.మీ. మేర ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కార్యరూపం దాల్చేలా చూడాలి. కాలువలను ఆధునికీకరించేందుకు గతేడాది ఆగస్టులో రూ.600 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినా.. అనేక పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. వాటిని పూర్తి చేయించాలి.
సమస్య: నగర పరిధిలో 3.5 కి.మీ. పొడవున ఉన్న ఏలేరు కాలువలో నీటి ప్రవాహం పెరిగినప్పుడల్లా అనేక ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. ఉప్పుటేరులో కలిసే గాడేరు మురుగు కాలువ పూడికతో నిండిపోవడం, ఆక్రమణలతో జనచైతన్య, ఎఫ్‌సీఐ కాలనీలు, మారుతీనగర్, గైగోలుపాడు తదితర ప్రాంతాలు ప్రభావితమవుతున్నాయి.
పరిష్కారం ఇలా: ఏలేరు కాలువ ఆధునికీకరణకు పదేళ్ల క్రితం రూ.264 కోట్లతో పనులను ప్రతిపాదించారు. నిధులు కేటాయించకపోవడంతో అంచనాలు ప్రస్తుతం రూ.800 కోట్లకు చేరుకున్నాయి. దశల వారీగానైనా ఆయా పనులు చేపడితే మేలు.
సమస్య: కీలకమైన పోతురాజు కాలువ ఆక్రమణలతో వరదనీరు ఏటా నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతోంది. వంద మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ కాలువ సగానికి కుచించుకుపోయింది.
పరిష్కారం ఇలా: పోతురాజు కాలువ ఆధునికీకరణ కోసం వైకాపా ప్రభుత్వంలో పనులు ప్రారంభించి, నిధుల కొరతతో నిలిపివేశారు. ఇప్పటికైనా ఆయా పనులను పూర్తి చేయాలి.
సమస్య: భారీ వర్షాలకు తుంగభద్ర, హంద్రీ నదులు, చక్కెర, సుద్దవాగుల నుంచి వరద నీరు సమీప కాలనీల్లోకి చేరుతోంది. బుధవారపేట, రోజాదర్గా, డాక్టర్స్ కాలనీ, శ్రీరామ్‌నగర్, గణేశ్‌నగర్ తదితర ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి.
పరిష్కారం ఇలా: తుంగభద్ర, హంద్రీ నదులు, చక్కెర, సుద్దవాగులకు రక్షణ గోడలు నిర్మించాలి. అందుకోసం రూ.244.70 కోట్లు అవసరమని 15 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారైనా.. ఆచరణకు నోచుకోలేదు. తుంగభద్ర, హంద్రీ నదుల సంగమ ప్రాంతం నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రూ.75.93 కోట్లతో రక్షణ గోడ నిర్మించినా.. సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది.
మూడేళ్లలో పనులు పూర్తిచేస్తాం.. నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
వర్షాకాలంలో ఏటా ముంపు బెడద ఎదుర్కొంటున్న నగరాలు, పట్టణాల్లో సమస్య పరిష్కారానికి రూ.9 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూడు దశల్లో చేపట్టనున్న కాలువల నిర్మాణ పనుల్లో.. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యమిస్తాం. వచ్చే మూడేళ్లలో పనులు పూర్తి చేస్తాం. ఈ ఏడాది కాలువల్లో పూడికలు తొలగించాలని కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.