హైదరాబాద్‌లో అక్రమంగా దేశంలోకి చొరబడిన ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను తెలంగాణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం హెచ్ఏఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్న వీరు.. అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో జీడిమెట్ల స్టేషన్ ఎస్హెచ్ఓ తన బృందంతో కలిసి అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించడంతో... ఏడుగురు విదేశీయులు అక్కడ ఉన్నట్లు తేలింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. వారి దగ్గర ఎలాంటి పాస్‌పోర్టులు, వీసాలు ,ఇతర అధికారిక పత్రాలు లేవని వెల్లడయ్యింది.
వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్టు పోలీసులు వివరించారు. అక్రమ చొరబాటుదారులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు.
అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎస్వోటీ కూకట్పల్లి జోన్ పోలీసులు పాల్గొన్నారు.గతంలోనూ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.
గతేడాది ఆగస్టులో 20 మంది బంగ్లాదేశ్ పౌరులను పట్టుకుని సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ బలగాలకు తెలంగాణ పోలీసులు అప్పగించారు. అంతకు ముందు ఏప్రిల్‌లోనూ అక్రమంగా ప్రవేశించే బంగ్లాదేశీయులకు బర్త్ సర్టిఫికెట్ జారీ కేసులో ఆరుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డ బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ హసిబుల్ కేసు విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు సహా ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోకి అక్రమంగా వచ్చిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు
.