Elon Musk Net Worth: ఎలాన్ మస్క్.. ఈ పేరును ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ప్రపంచ చరిత్రలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ట్రిలియనీర్ అంటే లక్ష కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో
సుమారు రూ. 95 లక్షల కోట్లు. ఇప్పుడు అంతకుమించిన సంపదతో ఉన్నారు మస్క్. స్పేస్ఎక్స్ చరిత్రాత్మక ఐపీఓ అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత మస్క్ నికర సంపద ఇప్పుడు ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇది భారత కరెన్సీలో చూస్తే ఏకంగా రూ. 105 లక్షల కోట్లు అధిగమించింది. ఈ ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్, రాయిటర్స్ అంచనా వేశాయి. ప్రపంచ కుబేరుల్లో చూస్తే మస్క్ దరిదాపుల్లో మరెవరూ లేకపోవడం విశేషం. మస్క్ ఈ స్థానానికి చేరుకునేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించారు. ఒకప్పుడు పాఠశాలలో తోటి విద్యార్థులతో తీవ్రంగా వేధింపులకు గురైన బాలుడు.. తన కలల్ని సాకారం చేసుకునేందుకు అమెరికాకు చేరుకున్న యువకుడు అసాధ్యం అనిపించినదాన్ని సుసాధ్యం చేశారు. విద్యుత్ కార్లు అసాధ్యం అని, రాకెట్లు మళ్లీ ఉపయోగించడం కల్పితం అని ప్రపంచం నవ్వుకున్న సమయంలో వాటిని వాస్తవంగా మార్చిన వ్యాపారవేత్త ఇప్పుడు మానవ చరిత్రలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా ఘనత సాధించారు. ఈ స్థానానికి చేరుకునేందుకు మస్క్ ఎలా శ్రమించారు.. ఏమేం కంపెనీల్ని స్థాపించారు అనేది వివరంగా తెలుసుకుందాం.సౌతాఫ్రికా నుంచి వచ్చి.. 1971లో సౌతాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టిన మస్క్ చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. కెనడా మీదుగా అమెరికా చేరుకున్న మస్క్ మొదటి వ్యాపార ప్రయత్వం ZIP2. తన సోదరుడు కింబల్ మస్క్‌తో కలిసి స్థాపించిన ఆ కంపెనీని 1999 లో దాదాపు 300 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఆ డబ్బుతో పేపాల్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. తర్వాత పేపాల్‌ను ఈబే కొనుగోలు చేయగా మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. ఆ డబ్బులన్నీ టెస్లా, స్పేస్ ఎక్స్‌పై.. పేపాల్‌ను విక్రయించగా భారీ సంపద రాగా చాలా మంది ఆ డబ్బును భద్రంగా దాచుకునేవారేమో. కానీ మస్క్ దాదాపు తన మొత్తం సంపదను టెస్లా, స్పేస్‌ఎక్స్‌లలో పెట్టుబడిగా పెట్టారు. 2008లో ఒక దశలో స్పేస్ ఎక్స్, టెస్లా రెండు కూడా దివాలా అంచుకు చేరుకొని పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా చాలా కష్టంగా మారింది. అయినా మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సంవత్సరం నాసా నుంచి స్పేస్ఎక్స్కు పెద్ద ఒప్పందం రావడం.. టెస్లాకు కూడా పెట్టుబడులు లభించడం ఆయన జీవితాన్నే మార్చేశాయి. కార్ల రంగాన్ని మార్చేసిన టెస్లా.. ఎలక్ట్రిక్ కార్లు అంటేనే నెమ్మదిగా వెళ్లే, పరిమిత సామర్థ్యం ఉన్న వాహనాలని ప్రపంచం భావించేది. కానీ టెస్లా ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. సంప్రదాయ కార్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు టెస్లానే ప్రధాన కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.స్పేస్ఎక్స్ అంతకంటే ఎక్కువ సక్సెస్.. స్పేస్ఎక్స్ ద్వారా మస్క్ అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు మరింత పెద్దవి. ఒకప్పుడు ఒక్క రాకెట్ ప్రయోగం కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా.. పునర్వనియోగ రాకెట్ల ద్వారా అంతరిక్ష ప్రయాణ ఖర్చుల్ని భారీగా తగ్గించారు. స్పేస్ ఇండస్ట్రీలో కొత్త పోటీ తీసుకొచ్చారు. నాసా వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపడం నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అందించడం వరకు స్పేస్ఎక్స్ శిఖరానికి చేరింది. ట్విట్టర్ కూడా కొనుగోలు.. విమర్శలు.. తర్వాత 2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. మూల్యం చెల్లించుకోక తప్పదు, మస్క్ జీవితంలోనే అత్యంత చెత్త వ్యాపార నిర్ణయం అంటూ ఇలా ఎందరో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. ప్రకటనదారులు కూడా వెనక్కి వెళ్లారు. మస్క్ మాత్రం అవేమీ ఆలోచించకుండా.. ట్విట్టర్‌ను x గా మార్చేసి సోషల్ మీడియా మాత్రమే కాకుండా.. దీనిని డిజిటల్ సేవల వేదికగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా మధ్య పోటీ కొనసాగుతున్న సమయంలో మస్క్ xAI ను ప్రారంభించారు. ఏఐ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు స్పేస్ఎక్స్ ఐపీఓతో చరిత్ర.. తాజాగా స్పేస్ఎక్స్ ఐపీఓ ద్వారా కంపెనీ 75 బిలియన్ డాలర్ల నిధుల్ని సమీకరించినట్లు సమాచారం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచింది. స్పేస్ఎక్స్లో మస్క్ వాటా విలువే వందల బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో.. టెస్లా, ఎక్స్, xAI, స్టార్‌లింక్ వంటి ఇతర ఆస్తులన్నీ కలుపుకుని ఆయన మొత్తం సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంచనా వేస్తున్నారు.మస్క్ ఎందుకు ప్రత్యేకం? ఎలాన్ మస్క్‌ను అభిమానించే వారు ఆయనను మాడ్రన్ ఎడిసన్‌గా అభివర్ణిస్తారు. విమర్శించే వారు ఆయన దగ్గర అధిక శక్తి కేంద్రీకృతమై ఉందని అంటారు. కానీ ఒక విషయం మాత్రం అంతా అంగీకరిస్తారు. డిజిటల్ పేమెంట్స్ (PayPal), ఎలక్ట్రిక్ కార్లు (Tesla), అంతరిక్ష రంగం (SpaceX), ఉపగ్రహ ఇంటర్నెట్ (Starlink), సోషల్ మీడియా (X), కృత్రిమ మేధస్సు (xAI) ఇలా ఇన్ని రంగాలను ఒకే జీవితకాలంలో ప్రభావితం చేసిన వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ప్రపంచం 'అది అసాధ్యం' అని చెప్పినప్పుడు.. మస్క్ 'ఎలా సాధ్యం చేయాలి?' అని ఆలోచించాడు. అదే ఆయనను ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలిపిందని ఆయన అభిమానులు చెబుతున్నారు.