గుంటూరు మిర్చి చాలా ఫేమస్.. గుంటూరు పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుంది. గుంటూరు మిర్చి యార్డులో ఆసియాలోనే అతిపెద్దదిగా పేరు ఉంది. లాంఫామ్ మిరప పరిశోధన
కేంద్రంలో కొత్త వంగడాలను ఆవిష్కరిస్తోంది. గుంటూరు మిర్చికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గుంటూరు మిర్చి ఘాటు, రుచికి వారంత ఫిదా అయ్యారు. తేజ రకం మిర్చి చైనాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. తాజాగా భారత్ నుంచి వెళ్లిన మూడు కంటెయినర్ల ఎండు మిర్చిని చైనా తిరస్కరించింది. మే నెలలో భారత్ నుంచి చైనాకు ఎండు మిర్చి మూడు కంటెయినర్లలో ఎగుమతి చేశారు. చైనాకు వెళ్లగానే అక్కడ సరుకును పరిశీలించిన అధికారులు రిజెక్ట్ చేశారు. మూడు ఎండుమిర్చి కంటెయినర్లను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని తిరస్కరించారు. భారత్ నుంచి పంపిన మిర్చిలో మిథామిడోపాస్ అనే కెమికల్ అధికంగా ఉందని తేలిందని.. మూడు కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టారు చైనా అధికారులు. చైనాకు వెళ్లిన తర్వాత అక్కడ తిరస్కరిస్తే మళ్లీ వెనక్కి తెచ్చుకోకుండా మరో దేశానికి రవాణా చేసి అమ్ముకోవాల్సి పరిస్థితి ఉంటుంది. ఇలా మిర్చిని రిజెక్ట్ చేయడంతో రవాణా ఛార్జీలు, వెయిటింగ్ ఛార్జీలు పెరిగి నష్టాలొస్తున్నాయని ఎగుమతి చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . ప్రస్తుతం చైనాకు ఎగుమతులు చాలా తక్కువగా గుంటూరుకు చెందిన వ్యాపారులు అంటున్నారు.ఇక్కడి నుంచి వెళ్లిన మిర్చిలో పురుగుమందుల అవశేషాలు మాత్రమే కాదు.. మిర్చిని సరిగా ఆరబెట్టకుండా ప్యాక్ చేసి పంపిస్తున్నారని.. అందుకే చైనాకు వెళ్లేసరికి బూజు వస్తోందంటున్నారు. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ ప్రభావం ఎగుమతులపై కనిపిస్తోందంటున్నారు. గతేడాది చైనా భారీగా మిర్చి కొనుగోలు చేసింది.. వారి దగ్గర నిల్వలు ఉన్నాయని.. అందుకే ఇప్పుడు కొర్రీలు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోందన్నారు. చైనా సంగతి పక్కన పెడితే మిగిలిన దేశాలకు మాత్రం మిర్చి ఎప్పటిలాగే ఎగుమతు అవుతోందంటున్నారు. అందుకే ప్రస్తుతానికి మార్కెట్లో ధర నిలకడగా ఉందంటున్నారు. కాకపోతే ఏపీ నుంచి ఎగుమతయ్యే మిర్చిలో ఎక్కువ భాగం చైనాకే వెళ్తోంది.. ముఖ్యంగా తేజ రకం ఎక్కువగా వెళ్తోంది అంటున్నారు.