ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతోంది ఏపీపీఎస్సీ . సోషల్ మీడియా వేదికగా ఉద్యోగాల భర్తీపై వైరల్ అవుతున్న సమాచారం అవాస్తవమని ఏపీపీఎస్సీ
ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న షెడ్యూల్ను కమిషన్ విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో అభ్యర్థులు అసత్య ప్రచారం నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే కమిషన్ అధికారిక వెబ్సైట్లోనే అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. APPSC ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా షెడ్యూల్ ఏదీ జారీ చేయలేదని కమిషన్ తెలిపింది. APPSC నోటిఫికేషన్లు, నియామక షెడ్యూళ్లు, పరీక్షలు, ఫలితాలు, ఎంపికలు మొదలైన వాటికి సంబంధించిన ధృవీకరించని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని, ప్రచారం చేయవద్దని, షేర్, ఫార్వార్డ్ చేయవద్దని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ అయిన ద్వారా ఇచ్చే సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.సోషల్ మీడియాలో రెండు రోజులుగా APPSC జాబ్ క్యాలెండర్ తేదీలు ప్రకటించిందని ప్రచారం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీచేసినట్లు సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. కొంతమంది APPSC నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్లు కొన్ని డాక్యుమెంట్లు షేర్ చేశారు. వెంటనే స్పందించిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల అంశంపై క్లారిటీ ఇచ్చింది.. ఈ సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఈ ఏడాది ఉగాది రోజు ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ మేరకు వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు అందులో పేర్కొన్నారు. మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీని వస్తాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు. అన్ని పోస్టుల్ని నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్నారు. యువతి నైపుణ్యం పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చన్నారు లోకేష్.