
విశాఖలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సులో మంత్రి లోకేశ్ ఏపీలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి మంత్రి లోకేశ్‌తో విద్యాశాఖ కమిషనర్ భరత్ గుప్తా, శ్రీసిటీ ఇంటర్నేషనల్ వర్సిటీ
ఛైర్మన్ శ్రీనిరాజు, డీజీ 100 ఎక్స్ సీఈవో హేమంత్ సహల్, విశాఖ ఎంపీ శ్రీభరత్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ విశ్వనాథన్
ఈనాడు, విశాఖపట్నం: ‘వికసిత భారత్ నిర్మాణమే మన లక్ష్యం. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడులు పెట్టాలి’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ‘డీజీ 100 ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో విద్య, ఆవిష్కరణలు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మేధావుల మధ్య విశాఖలో ఉండటం ఆనందంగా ఉందన్నారు. సంస్థలను తీర్చిదిద్దుతూ, అవకాశాలను సృష్టిస్తూ, ప్రతిభను పెంపొందిస్తూ కోట్ల మంది భారత యువత జీవితాలను ప్రభావితం చేస్తున్న నాయకులు ఈ సభలో కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ‘మన పాత్రలు వేర్వేరు అయినా.. బలమైన భారతదేశ నిర్మాణం మన ఉమ్మడి లక్ష్యం. విద్యారంగంలో భాగస్వాములు కావడానికి ఇంతకంటే అద్భుతమైన సమయం మరొకటి లేదు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
‘ఈ వేగవంతమైన ప్రపంచంలో ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా అత్యంత పెద్ద పోటీ ప్రతిభ ఒక్కటే. పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయగల రాష్ట్రాలదే భవిష్యత్తు. అందుకే ఏపీ వృద్ధి వ్యూహంలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమైన అంశం. మేం నిన్నటి ఉద్యోగాల కోసం విద్యార్థులను తయారు చేయడం లేదు. సరికొత్తగా అభివృద్ధి చెందుతున్న ఏఐ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు తగినట్లు సిద్ధం చేస్తున్నాం. మరో రెండు వారాల్లో నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఫిషరీస్, ఆక్వా, ఆటోమోటివ్, గ్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాసూటికల్స్, డేటా సెంటర్స్ వంటి 22 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని లోకేశ్ వివరించారు.
‘ప్రపంచంలో అత్యుత్తమ విద్యాసంస్థలు టాలెంట్, నాలెడ్జ్, పారిశ్రామికవేత్తలను తయారుచేస్తాయి. ఈ మూడు లక్ష్యాలను సాధించగల సంస్థలతో భాగస్వామి కావడానికి ఏపీ సిద్ధంగా ఉంది. ప్రపంచస్థాయి పోటీకి తగిన పరిశోధన ఆధారిత, ఆవిష్కరణలతో నడిచే సంస్థలను నిర్మించడమే మా లక్ష్యం. ఏఐని స్వాగతించే యూనివర్సిటీలే భవిష్యత్తును శాసిస్తాయి. ఏఐ ఆధారిత విద్య, పరిశోధన, పాలన, ఆవిష్కరణలకు ఏపీ ఒక ప్రయోగశాలగా మారాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే డేటా సెంటర్లు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అత్యంత కీలకమైనవి. ఇకపై దేశ సంపదను చమురు నిల్వలతో కాదు, కంప్యూటింగ్ సామర్థ్యంతో లెక్కిస్తారు’ అని మంత్రి లోకేశ్ అన్నారు.
‘భారత దేశ పెట్టుబడుల్లో 25శాతం ఏపీకే వస్తున్నాయి. పెట్టుబడిదారులకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను ఏపీ నిర్మిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలు. వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సమగ్ర అభివృద్ధి వంటి లక్ష్యాల సాధనలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భారత దేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిని గూగుల్ ఏపీలో పెడుతోంది’ అని మంత్రి లోకేశ్ వివరించారు. కార్యక్రమంలో డీజీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో హేమంత్ సహల్, విశాఖ ఎంపీ శ్రీభరత్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతరెడ్డి, విద్యాశాఖ కమిషనర్ భరత్ గుప్తా, శ్రీసిటీ ఇంటర్నేషనల్ వర్సిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.