
డీఎస్సీ విషయంలో ఆయన ప్రశ్నిస్తున్నది రాజ్యాంగాన్ని త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ తిరుపతి సభలో మంత్రి నారా లోకేశ్ ఈనాడు, తిరుపతి: రాష్ట్రంలో రెండేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని తెదేపా
కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలోనే అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజాప్రభుత్వంలో దాడులు, జేసీబీలతో కూల్చివేతలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు.. చివరకు బూతులు కూడా లేవని చెప్పారు. ‘‘చిన్నప్పుడు పదో తరగతి పేపర్ లీక్ చేసి దొరికితే ఉపాధ్యాయులు జగన్‌ను కొట్టారు. అందుకే ఆయనకు టీచర్లంటే కోపం. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 226 కేసులు వేయించినా, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఈ విషయంలో ఆయన సీఎం చంద్రబాబును, మంత్రిగా ఉన్న నన్ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. ఆయన ప్రశ్నిస్తున్నది అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
దామినేడులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజాప్రభుత్వం నినాదం ఒక్కటే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. జగన్‌కు సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే జబ్బుంది. మేం ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ తీసుకొస్తే ఆ ప్లాంట్ ఆంధ్రకు రావట్లేదని ప్రెస్‌మీట్ పెట్టి చెబుతారు. మేం భూమిపూజ చేసిన తర్వాత అది తానే తెచ్చానంటారు. గూగుల్ ఆయనే వల్లే వచ్చిందని చెబుతున్నారు. జగన్ తెచ్చింది.. ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ మద్యం బ్రాండ్లు మాత్రమే. విశాఖ ఉక్కు కర్మాగారం ఇబ్బందుల్లో ఉంటే రెండుసార్లు కాపాడిన ఘనత ఎన్డీయేది. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రాబోతోంది.’’ అని లోకేశ్ తెలిపారు.
‘రాయలసీమకు ఫైటర్ జెట్ పరిశ్రమను, రాయల్ ఎన్ఫీల్డ్ను రప్పించాం. జగన్ అనే పేరులో ఉన్న జీ అంటే ‘జెన్ జీ’ అనుకుంటున్నారు. కానీ అది గొడ్డలి. రూ.లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కానుంది. 2019 నుంచి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలనలో బీసీ బిడ్డ అమరనాథ్, దళిత వైద్యుడు సుధాకర్, నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ బలైపోయారు. వైకాపా నాయకులు తెదేపా జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే వారి జెండా పీకేశారు. వై నాట్ 175 అంటే ప్రజలు టీమ్ 11 ఇచ్చారు. జగన్‌కు దేశభక్తి కూడా లేదు. మేం సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొస్తే అది నకిలీదని ప్రచారం చేశారు. దేశరక్షణ కోసం ఆ సంస్థ బోట్లు తయారుచేస్తుంది. వెయ్యి మంది మత్య్సకారులకు ఉద్యోగాలొస్తాయి. ఆ కంపెనీని తరిమేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు వైకాపా కార్యకర్తలు రప్పారప్పా అంటున్నారు. ప్రజలే వారిని రఫ్ఫాడిస్తారు’ అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా, జనసేన, భాజపా.. పెద్ద కుటుంబమని, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.