ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీలో టీడీపీ కూటమి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. అయితే రెండేళ్లు పూర్తి అయినా కూడా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను తప్పి వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్రవ్యా్ప్తంగా వైసీపీ ర్యాలీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే నందిగామలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిరసనలో భాగంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఇంటి నుంచి దున్నపోతుతో ర్యాలీ నిర్వహించారు. అయితే చుట్టుపక్కల జనం, వారి హడావిడిని చూసిన దున్నపోతు బెదిరి పోయింది. చుట్టుపక్కల వారిని పొడిచి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆర్డీవో కార్యాలయం వద్ద దున్నపోతుతో నిరసన చేస్తుండగా ఊహించని విధంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఆరోపణ. రెండేళ్లు పూర్తవుతున్నా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలను పేర్లు మార్చి అమలుచేస్తున్నారని.. అందులోనూ కోతలు విధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాల ఊసే లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ శుక్రవారం రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దిష్టిబొమ్మల దహనం, భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నందిగామ వైసీపీ నేతలు ఇలా వినూత్నంగా దున్నపోతుతో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే జనం దెబ్బకు దున్నపోతు బెదిరి అక్కడి నుంచి పరారైంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.