
వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో రెండేళ్లలో గాడిన పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi Kumar) తెలిపారు. ఈ
సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan) అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామన్నారు. గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. వచ్చే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ధైర్యంగా చెబుతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP government) హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించి 13 పైసలు ట్రూ డౌన్ దిశగా చేసిన ఏకైక ప్రభుత్వం తమది అని తెలిపారు. పీఎం సూర్యఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి బయట నుంచి కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సంప్రదాయేతర ఇంధనం 160 జిగావాట్ లక్ష్యంగా అడుగు వేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. ట్రాన్స్మిషన్ నష్టాలు, ఇబ్బందులు తగ్గించేందుకు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.