
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మార్షల్ లా విధించిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ (Yoon Suk Yeol) ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. కాగా 2024 అక్టోబర్లో ఉత్తర కొరియాలోకి
డ్రోన్లు పంపినందుకు గాను ఆయనకు మరో 30ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు దక్షిణ కొరియాలోని కోర్టు తీర్పు వెలువరించింది. కిమ్ సేనను రెచ్చగొట్టేందుకే ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా పార్లమెంటును తన గుప్పిట్లోకి తీసుకునేందుకు, నేతలను అరెస్టు చేసేందుకు, అనియంత్రిత అధికారాన్ని చెలాయించేందుకు ఆయన విధించిన ‘మార్షల్ లా’ విఫలమవడంతో ఓ సాకు సృష్టించుకోవడానికి ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించింది.
యూన్తో పాటు, ఆయన మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్, డిఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ మాజీ అధిపతి యో ఇన్ హ్యూంగ్, డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్స్ మాజీ అధిపతి కిమ్ యోంగ్-డేలను న్యాయస్థానం దోషులుగా నిర్ధరించింది. వారికి కూడా జైలు శిక్ష విధించింది. అత్యవసర పరిస్థితిని సృష్టించడం కోసం ఉత్తర కొరియాను రెచ్చగొట్టడానికి నిందితులు సైనిక చర్య అనే ముసుగును ఉపయోగించారని విమర్శించింది. అయితే చెత్త బెలూన్లను తమ దేశంపై ప్రయోగించి.. తమను రెచ్చగొట్టడానికి యత్నించిన ఉత్తర కొరియాకు తగిన బుద్ధి చెప్పడానికే మాజీ అధ్యక్షుడు ఆ దేశంలోకి డ్రోన్లను పంపారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 2024 డిసెంబరులో అధికారంలో ఉన్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ‘మార్షల్ లా’ విధించారు. వారి నుంచి దేశానికి రక్షణ కల్పించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటల వ్యవధిలోనే ఆ ప్రకటనను విరమించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అభిశంసనకు గురై పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.