
మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు రావడం మొదలయ్యాయి. అయితే.. వర్షాలు పడటం మొదలుపెట్టగానే.. పాములు బయటకు రావడం మొదలుపెడతాయి. పుట్టలన్నీ నీళ్లతో నిండిపోతాయి కాబట్టి.. అవి
వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి పొడిగా ఉండే ప్రదేశాల కోసం వెతుకుతాయి. ఈ క్రమంలోనే ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి. అయితే.. మీ ఇంటి చుట్టు పక్కల కనుక కొన్ని రకాల మొక్కలు ఉంటే.. పాములు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి.. పాములు రాకుండా ఉండాలంటే మీ గార్డెన్ లో ఏ మొక్కలు ఉండకూడదో తెలుసుకుందాం…
దట్టంగా పెరిగే వెదరు మొక్కలు పాములను బాగా నచ్చుతాయి. ఆ ప్రదేశం వాటికి దూచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి.. మీ చుట్టుపక్కల అలాంటి మొక్కలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.
గోరింటాకు, దరంతా, పీకాక్ ఫ్లవర్ ప్లాంట్ లాంటి మొక్కలు కూడా పొదల్లా గుబురుగా ఉంటాయి. ఈ మొక్కల కింద కూడా పాములు ఆశ్రయం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాములు రాకుండా ఉండాలంటే వాటిని కూడా తొలగించడం ముఖ్యం.
అరటి తోటలు లేదా మొక్కల చుట్టూ తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ రాలిపడిన ఎండిన ఆకులు పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి.
వేప చెట్టు, మామిడి చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు వంటి చెట్ల నుంచి ఆకులు ఎక్కువగా రాలుతూ ఉంటాయి. అవి రాలి ఒక చోట కుప్పగా చేరితే.. ఆ ప్రదేశంలోకి వచ్చి పాములు దాక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రాత్రిపూట తోటలోకి లేదా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతిలో టార్చ్ లైట్ (Flashlight) లేదా మొబైల్ లైట్ ఆన్ చేసుకుని వెళ్లాలి. తోట చుట్టూ రాత్రంతా వెలుతురు ఉండేలా లైట్లు అమర్చాలి.
తోటపని చేసేటప్పుడు లేదా మొక్కలను కత్తిరించేటప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు పొడవాటి గమ్ బూట్లు (Gum boots) ధరించడం చాలా సురక్షితం.
వానాకాలం ముగిసే వరకు చిన్న పిల్లలను దట్టమైన పొదల దగ్గర, కట్టెల కుప్పల వద్ద ఒంటరిగా ఆడుకోవడానికి పంపకూడదు.
ఒకవేళ అనుకోకుండా తోటలో లేదా ఇంట్లో పాము కనిపిస్తే భయపడకూడదు. దాన్ని సొంతంగా పట్టుకోవడానికి లేదా కర్రలతో కొట్టి చంపడానికి ప్రయత్నించి పామును రెచ్చగొట్టవద్దు.
పాము కనిపించిన వెంటనే సురక్షితమైన దూరంలో ఉంటూ, వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ (పాములు పట్టే) బృందానికి సమాచారం ఇచ్చి వారి సహాయం తీసుకోవాలి.