
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్ఖాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ముందు ఉంచిన
ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని బృందం వైట్‌హౌస్‌తో నెలకొల్పుకున్నప్పటికీ.. ట్రంప్ తాజాగా అడిగిన కోరిక వారిని నోటమాట రాకుండా చేసింది. అదే.. ఇజ్రాయెల్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వడం. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ఏ దేశాన్ని అయితే ముస్లిం ప్రపంచం గుండెల్లో గుచ్చిన కత్తి అని అభివర్ణించారో.. అలాంటి ఇజ్రాయెల్‌తో స్నేహం గురించి పాకిస్థాన్ ఆలోచించడం కూడా పెను తుఫానును ఆహ్వానించడమే అవుతుంది.వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పశ్చిమ, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో తనదైన ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఆలస్యం అవుతుండటంతో కేవలం యుద్ధాన్ని ముగించడమే కాకుండా ఓ కొత్త చరిత్రను సృష్టించాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన పాత అజెండా అయిన అబ్రహం అకార్డ్స్. తన మొదటి పదవీకాలంలో 2020లో అరబ్ దేశాలైన బహ్రెయిన్, యూఏఈ, మొరాకోలతో ఇజ్రాయెల్‌కు దౌత్య సంబంధాలను ఆయన పునరుద్ధరించారు. ఇప్పుడు పాకిస్తాన్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. దీని ద్వారా ఇరాన్‌ను ఒంటరి చేసి, ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలనేది ట్రంప్ వ్యూహం.అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన పాకిస్థాన్‌లో తీవ్ర కలవరాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ముస్లిం దేశాలకు స్వయం ప్రకటిత నాయకుడిగా చలామణి అవ్వాలని చూసే పాకిస్థాన్‌కు ఇది పెద్ద అవమానంగా తోచింది. ఈ ప్రతిపాదనపై ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి నేరుగా హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ఏ అగ్ర నాయకుడు గానీ, ఆర్మీ జనరల్ గానీ ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశంపై ఆలోచిస్తే వారిని హతమారుస్తామని బెదిరించాడు. దీంతో పాకిస్థాన్ పాలకులకు అటు అమెరికాను కాదనలేక ఇటు స్వదేశంలో ఉగ్రవాదులు, ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది.చరిత్రను పరిశీలిస్తే పాకిస్థాన్ ఇరుక్కున్న ఈ వ్యూహాత్మక ఉచ్చుకు మూలాలు 19వ శతాబ్ధపు ది గ్రేట్ గేమ్లో ఉన్నాయి. నాడు బ్రిటీష్, సోవియట్ సామ్రాజ్యాలు మధ్య ఆసియాపై పట్టు కోసం పోటీ పడ్డాయి. ఆ సమయంలో బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన సరిహద్దులే విభజన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చాయి. భౌగోళికంగా పాకిస్థాన్ ఉన్న వ్యూహాత్మక స్థానమే దానిని ఎప్పుడూ అంతర్జాతీయ శక్తులకు అవసరమైన దేశంగా మార్చింది. శీతల యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్‌ను అడ్డుకోవడానికి అమెరికాకు పాకిస్థాన్ అవసరమైంది. దానికి ప్రతిఫలంగా పాకిస్థాన్‌కు భారీగా సైనిక, ఆర్థిక ప్యాకేజీలు అందాయి. ఆ తర్వాత 9/11 దాడుల అనంతరం కూడా అమెరికా తన స్వార్థం కోసం పాకిస్థాన్‌ను వాడుకుంటూనే వచ్చింది.పాకిస్థాన్ ఎప్పుడూ ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తూ వచ్చింది. అమెరికా నుంచి డాలర్లు తీసుకుంటూనే ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది. అటు చైనాకు ఆర్థిక కారిడార్‌ను కట్టబెట్టింది. అయితే ది గ్రేట్ గేమ్ లో ఎప్పుడూ ఒకే విధమైన లాభాలు ఉండవు. ఇచ్చేవాడు ఎప్పుడైనా ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు ట్రంప్ సరిగ్గా అదే చేశారు. ఆయన రష్యా, చైనా, ఇరాన్ కూటమిని దెబ్బతీయడానికి పాకిస్తాన్‌ను మరోసారి ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. ప్రతిసారీ అందరినీ మోసం చేసి తప్పించుకున్నట్లే, ఈసారి కూడా అమెరికాకు మాయమాటలు చెప్పి బయటపడతామని పాకిస్తాన్ ఆశిస్తోంది, కానీ ఈసారి ట్రంప్ పెట్టిన ఇజ్రాయెల్ ముడి అంత తేలికగా విడిపోయేలా కనిపించడం లేదు.