
Hyderabad : దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నగరంలో దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలతోపాటు.. పలు దేశాలకు చెందిన వారు కూడా నివాసం ఉంటున్నారు. పేదల నుంచి ధనికుల వరకు అందరూ జీవనం సాగించేందుకు ఈ
నగరంలో అవకాశాలు ఉన్నాయి. అయితే, తాజా అధ్యయనంలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వేడి కారణంగా ఏర్పడే అనారోగ్య సమస్యల ముప్పును ఎదుర్కొంటున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకోవటం కాస్త ఆందోళనకర విషయమే.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో భాగంగా.. ‘మూవింగ్ బియాండ్ ఎక్స్పోజర్: ఎ గ్లోబల్లీ కంపేరబుల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ హీట్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ సిటీస్’ పేరుతో ప్రపంచంలోని 205 నగరాలపై ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 30 నగరాలు తీవ్రమైన వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉండటంతో ఆందోళన కలిగించే విషయం
భారతదేశంలో అహ్మదాబాద్, నాగ్ పూర్, మదురై అధిక వేడి ప్రమాదాన్ని కలిగి ఉండగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇక దాదాపు 80లక్షల మంది నివసించే హైదరాబాద్ ఈ నగరాల తరువాతే ఉండగా.. హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్ లో మొత్తం 0.68 వేడి ప్రమాద స్కోరును నమోదు చేసింది. ఇది కైరో, మనీలా, హో చి మిన్ సిటీ వంటి ప్రమాదం ఉన్న నగరాల కంటే కేవలం 0.05 నుంచి 0.10 పాయింట్లతో స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉండగా.. బ్యాంకాక్, హనోయ్ వంటి నగరాల కంటే అధ్యాన్నంగా ఉంది.
హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అనేది ఒక ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన వేడిని ఎంత మేరకు ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నారో అంచనా వేసే సూచిక. ఇందులో కేవలం ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా, నగరంలో అందుబాటులో ఉన్న పచ్చదనం, శీతలీకరణ మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, హైదరాబాద్ నగరంలో అత్యధిక శాతం ప్రజలకు పచ్చదనం, శీతలీకరణ సదుపాయాలు పరిమితంగా ఉండటంతో వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 వరకు నగరంలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు 47 ఉండగా, గత పదేళ్లలో ఇదే అత్యధికంగా నమోదైన సంఖ్య కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.