
FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే అభిమానులకు ఊహించని రేంజ్ హైడ్రామా, ఉత్కంఠ
ఎదురైంది. మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ తొలి పోరులో మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో వన్ సైడ్ విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్ కేవలం గోల్స్ కోసమే కాకుండా.. మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలు, ఏకంగా మూడు రెడ్ కార్డ్‌లు నమోదైన మ్యాచ్‌గా ఫుట్‌బాల్ చరిత్ర పుటల్లోకెక్కింది.
మ్యాచ్ ప్రారంభమైన మొదటి 10 నిమిషాల లోపే మెక్సికో జట్టు అద్భుతమైన ఆటతీరుతో మొదటి గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మ్యాచ్ 67వ నిమిషంలో మెక్సికో ఆటగాళ్లు మరో నిర్ణయాత్మక గోల్ చేయడంతో సౌతాఫ్రికాపై ఒత్తిడి తీవ్రమైంది. ఎక్స్ట్రా టైమ్‌తో కలిపి గంటకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మెక్సికో ప్లేయర్స్ ఏకంగా 16 సార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా, ఆఫ్రికా జట్టు కేవలం 3 సార్లు మాత్రమే గోల్ పోస్ట్ వైపు రాగలిగింది. మ్యాచ్ జరిగినంత సమయం 61 శాతం బంతి మెక్సికో ఆటగాళ్ల నియంత్రణలోనే ఉంది.
మైదానంలో అసలేం జరిగింది? ఆ ముగ్గురు ఎవరు?
మొదటి హాఫ్ ముగిసే సమయానికి మెక్సికో 1-0తో ముందంజలో ఉంది. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అసలు గొడవ మొదలైంది. సౌతాఫ్రికా ప్లేయర్ స్ఫెఫెలో సిట్‌హోల్ ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కింద పడేయడంతో రెఫరీ అతనికి మొదటి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆఫ్రికాకే చెందిన టెంబా జ్వానే.. మెక్సికో ప్లేయర్ రాబర్టో అల్వరాడోను దూకుడుగా అడ్డుకునే క్రమంలో చేయి కాస్తా అతని మూతికి బలంగా తగిలింది. దీంతో రెఫరీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండో రెడ్ కార్డ్ ఇచ్చారు. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి ఎక్స్ట్రా టైమ్‌లో మెక్సికో డిఫెండర్ సేజార్ మోంటెజ్ కూడా ప్రత్యర్థిని రాంగ్ టాకిల్ చేసి కింద పడేయడంతో అతనికి కూడా రెడ్ కార్డ్ దక్కింది.
అసలు ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డ్ ఎందుకు ఇస్తారు?
ఫుట్‌బాల్ ఆటలో క్రమశిక్షణ, నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. మైదానంలో ఏదైనా జట్టు ఆటగాడు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినప్పుడు లేదా ఉద్దేశపూర్వకంగా అవతలి ప్లేయర్‌ను గాయపరిచేలా ప్రవర్తించినప్పుడు రెఫరీ రెడ్ కార్డ్ చూపిస్తారు. ముఖ్యంగా ప్రమాదకరమైన టాకిల్స్, హింసాత్మక ప్రవర్తన, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈ కార్డ్ ఇస్తారు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఓపెనింగ్ మ్యాచ్‌లో మూడు రెడ్ కార్డ్‌లు ఇవ్వడం ఇదే తొలిసారి.
ఫుట్‌బాల్ నిబంధనల ప్రకారం.. ఒకసారి ఒక ఆటగాడికి రెడ్ కార్డ్ లభిస్తే, అతను తక్షణమే మైదానాన్ని విడిచి బయటకు వెళ్లిపోవాలి. ఆ మ్యాచ్‌లో మిగిలిన సమయం అంతా అతను ఇక ఆడటానికి వీల్లేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఆటగాడి స్థానంలో మరొక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను గ్రౌండ్ లోకి దించే హక్కు ఆ టీమ్‌కు ఉండదు. అంటే అప్పటివరకు 11 మందితో ఆడిన జట్టు.. 10 మందితోనే మ్యాచ్ కొనసాగించాల్సి వస్తుంది (సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో ఇద్దరు పోవడంతో 9 మందితోనే ఆడింది). సాధారణంగా రెడ్ కార్డ్ పొందిన ప్లేయర్‌పై తదుపరి మ్యాచ్ ఆడకుండా వన్-మ్యాచ్ బాన్ కూడా విధిస్తారు.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.