ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతుంటే.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ కేసుల్లో ఫిర్యాదు
చేసిన వ్యక్తి ఎస్సీ హోదాను పోలీసులు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి లేఖలో కోరారు రఘురామ. సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఉండదని రఘురామ గుర్తు చేశారు. వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులూ వర్తించవన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా కేసు పెడితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు, వెంటనే అయినా ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్సీ హోదాను ధ్రువీకరించుకునేలా ఆదేశించాలని కోరారు. క్రైస్తవంలోకి మారి ఎస్సీ హోదా కోల్పోయిన వారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దాఖలు చేసే కేసులను స్వీకరించకుండా చూడాలని డీజీపీని లేఖలో కోరారు రఘురామ.డిప్యూటీ స్పీకర్ రఘురామ గతంలో కూడా డీజీపీకి లేఖలు రాశారు. ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్లపై రఘురామ లేఖ రాశారు. రాష్ట్రంలో శబ్దకాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.. ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా అధిక శబ్దంతో విద్యార్థులు, వృద్ధులు, రోగులు ఇబ్బందిపడుతున్నారన్నారు. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రఘురామ. పోలీసులకు అనధికార సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకునే అధికారం ఉందన్నారు. రాష్ట్రంలో ఒకే విధంగా నిబంధనలు అమలు చేయాలని లేఖలో ప్రస్తావించారు డిప్యూటీ స్పీకర్.