Gachibowli Villa Gold Theft : గచ్చిబౌలిలోని అత్యంత విలాసవంతమైన హిల్ రిడ్జ్ విల్లాస్‌లో జరిగిన భారీ నగల చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. యజమాని ఇంట్లో లేని సమయం చూసి
కోట్ల విలువైన సంపదతో పరారైన నేపాల్‌కు చెందిన దంపతులతో పాటు వారికి సహకరించిన మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితుల నుంచి దాదాపు రూ. 10 కోట్ల విలువ చేసే 7.8 కిలోల బంగారు ఆభరమాలు, 1.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టుకు సంబంధించిన సంచలన వివరాలను సైబరాబాద్ సీపీ రమేశ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. యజమాని ముంబయి వెళ్లగానే.. ఇల్లు దోచేసిన దంపతులు!పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్లోని నివాసి ప్రకాశ్ పాయ్ ఇంట్లో నేపాల్‌కు చెందిన కమల్ షాహీ, విమల షాహీ అనే దంపతులు కొంతకాలంగా పని మనుషులుగా చేరారు. ఈ నెల 6వ తేదీన యజమాని ప్రకాశ్ పాయ్ కుటుంబం వ్యక్తిగత పనులపై ముంబయికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన నేపాలీ దంపతులు ఆ రాత్రి ఇంట్లోకి చొరబడి లాకర్లలో ఉన్న భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ పారిపోయారు. అక్కడి నుంచి మరో ప్రైవేట్ వాహనంలో రాంపూర్ మీదుగా నేపాల్ సరిహద్దు దాటేందుకు పక్కాగా ప్లాన్ వేశారు. పారేసిన సిమ్ కార్డ్ కవర్లే.. నిందితును పట్టించాయి!చోరీ జరిగినట్లు గుర్తించిన వెంటనే రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాల వేట ప్రారంభించారు. నిందితులు దొంగతనం చేసిన తర్వాత నేరుగా నగరంలోనే ఉంటున్న కమల్ సోదరి కల్పనా షాహీ నివాసానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ వారు పాత సిమ్ కార్డులను తీసేసి, పోలీసులకు దొరకకూడదని కొత్త సిమ్ కార్డులను మొబైల్స్‌లో వేసుకున్నారు. అయితే వారు చేసిన చిన్న పొరపాటు పోలీసులకు వరంగా మారింది. కొత్త సిమ్ కార్డుల తాలూకు కవర్లను వారు అక్కడే పారేసి సికింద్రాబాద్ వెళ్లిపోయారు. అయితే గచ్చిబౌలి క్రైమ్ టీమ్స్ ఆ సిమ్ కార్డ్ కవర్ల ఆధారంగా కొత్త మొబైల్ నంబర్లను వేగంగా గుర్తించి వాటిని నిరంతరం ట్రాక్ చేయడం ప్రారంభించారు. నిందితుల కదలికలు యూపీ సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించిన సైబరాబాద్ సీపీ.. వెంటనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడి స్థానిక పోలీసులు నిందితులను సరిహద్దుల వద్దే చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.విమానంలో హైదరాబాద్‌కు తరలింపు..!నిందితులు దొరికినట్లు సమాచారం అందిన వెంటనే.. గచ్చిబౌలి డీఐ నరేశ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మరుసటి రోజే అక్కడికి చేరుకుంది. న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ నిందితులను అత్యంత వేగంగా విమానంలో నగరానికి తరలించారు. ఈ భారీ దోపిడీకి ముందే పథకం రచించిన వారిలో నేపాలీలను ఇళ్లలో పనికి కుదిర్చే సురేశ్ అనే బ్రోకర్, అలాగే కరణ్ బిశ్వకర్మ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. పోలీసులు కరణ్‌ను అరెస్ట్ చేయగా.. సురేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. చోరీ జరిగిన రోజే సురేశ్ సదరు విల్లా కిటికీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మొదట పట్టుకున్నప్పటికీ.. అతడి మోసాన్ని గ్రహించలేక వదిలేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు సీపీ స్పష్టం చేశారు.