
దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయకుండా ఆంక్షలు
విధించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌కు అసాధారణంగా డిమాండ్ పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర, సాధారణ పెట్రోల్ బంకుల్లోని ధర కంటే ఎక్కువగా ఉండటంతో అనేక సంస్థలు బంకుల నుంచే భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో సాధారణ వినియోగదారులకు సరఫరా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం భావించింది.ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర పెట్రోల్ బంకులో రూ.95.20గా ఉంది. అదే బల్క్ కొనుగోలుదారులకు ఈ ధర రూ.134.50గా ఉంది. ఈ తేడా కారణంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు బల్క్ డిపోల బదులు బంకుల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని గుర్తుచేసింది. షిప్పింగ్ వ్యవస్థ కూడా ప్రభావితమవడంతో దేశీయంగా ఇంధన లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఆంక్షలు తీసుకొచ్చింది.మరోవైపు ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (పీఈఎస్ఓ) అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే డీజిల్ విక్రయించాలి. ఒక వినియోగదారు లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఆదేశించారు. దీన్ని మళ్లీ విక్రయించడం పూర్తిగా నిషేధం.