
IRCTC:టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు, తత్కాల్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను తగ్గించడమే కొత్త IRCTC వెబ్సైట్ లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రైల్వే
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్షలాది మంది ప్రతిరోజూ ఉపయోగించే ఐఆర్సీటీసీ (IRCTC) ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు కొత్త వెబ్‌సైట్‌ను తీసుకురానుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, అప్‌గ్రేడ్ చేసిన కొత్త IRCTC వెబ్సైట్ 2026 జూలై 15న అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐఆర్సీటీసీ పోర్టల్‌పై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ నెమ్మదిగా పనిచేయడం, క్యాప్చా సమస్యలు, సైట్ క్రాష్ అవడం వంటి ఇబ్బందులు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ అంశాలను విద్యార్థులు నేరుగా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు.
దీంతో కొత్త వెబ్సైట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్త ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఫ్రెండ్లీ డిజైన్, వేగవంతమైన పనితీరు, సులభమైన టికెట్ బుకింగ్ ప్రక్రియ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా అధిక ట్రాఫిక్ సమయంలో కూడా వెబ్సైట్ స్థిరంగా పనిచేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, రైల్వే శాఖ డిజిటల్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు కీలక చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో బుక్ అవుతున్న టికెట్లలో సుమారు 88 శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ప్రయాణికులకు మెరుగైన అనుభవం అందించేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థలను ప్రవేశపెడుతున్నారు.
అంతేకాకుండా, 1986 నుంచి ఉపయోగంలో ఉన్న పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను కూడా ఆధునికీకరించనున్నారు. ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థ వచ్చే ఆగస్టు నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల టికెట్ బుకింగ్, వెయిటింగ్ లిస్ట్ నిర్వహణ, సీట్ల కేటాయింపు వంటి సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే కొత్త వెబ్సైట్ ప్రారంభమైన తర్వాత కూడా తత్కాల్ టికెట్ల సమస్య, బాట్స్ వినియోగం, అధిక డిమాండ్ సమయంలో సర్వర్ పనితీరు వంటి అంశాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. అయినప్పటికీ, ఈ మార్పులు భారతీయ రైల్వే డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.