
హైదరాబాద్, న్యూస్‌టుడే: కేంద్రంలో పన్నెండేళ్లుగా అధికారంలో ఉంటూ నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ దేశంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి
ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లోని ఒక్క రాజ్యసభ సీటు కోసం దిగజారుడు రాజకీయాలు చేయాలా? అంటూ నిలదీశారు. ఈ మేరకు గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘మహిళా నేత మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లనీయకుండా సీటు చోరీ చేయడం దౌర్భాగ్యం. ఒక ప్రైవేటు ఫిర్యాదులో ఏముందో తెలుసుకోకుండానే రిటర్నింగ్ అధికారి మీనాక్షి రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడమేంటి? మోదీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై హరీశ్‌రావు భాజపాను ప్రశ్నించకుండా కాంగ్రెస్‌పై బురదజల్లడం అవివేకం. ఎవరైనా కోవర్టులుంటే వారిపె చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టంచేశారు.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)కి లేదన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల వ్యవస్థను భాజపా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ అశోక్‌గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌రావు, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతూ.. భాజపా తీరును విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.