
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను పెద్దగా వ్యాఖ్యానించదలచుకోలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు
. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడినప్పుడు కొందరి ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. కేంద్రం గురించి మాట్లాడేందుకు పరిమితమైన అంశాలున్నాయని, కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, అన్నీ కుంభకోణాలే.. ఏ వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘పేపర్ తయారీలో ఎవరెవరున్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి పేపర్ లీకైంది? ఎంతమేర లంచాలు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. లేకపోతే వైకాపా అధికారంలోకొచ్చాక విచారణ కమిషన్‌ను వేసి, తప్పు చేసినవారిని శిక్షిస్తాం’ అని చెప్పారు.
‘స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గతంలో ఉన్న 74 జీవోను రద్దుచేసి.. తమవారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకు వీలుగా.. క్రీడల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఉంటే చాలు, డీఎస్సీ పరీక్ష కూడా రాయక్కర్లేదంటూ జీఓ 4, 47లను తీసుకొచ్చారు. ఇలా 270 ఉద్యోగాలు ఇచ్చారు. సాఫ్ట్‌బాల్‌లో 38, జూడోలో 39 మందికి పోస్టులు ఇచ్చారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు, జూడో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మంత్రి లోకేశ్ తోడల్లుడు, తెదేపా ఎంపీ భరత్. తమవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాక జీఓ 4, 47లను రద్దు చేసి.. 25, 56 జీఓలను తీసుకొచ్చారు. మొదటి జీఓలు మంచివే అయితే ఎందుకు రద్దుచేశారు’ అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీలు అందులో భాగమే. వారి ఆశలను నలిపేస్తే కోట్లమంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా’ అన్నారు.
‘అబద్ధం, మోసం, వెన్నుపోటు, దగా, కుంభకోణానికి చొక్కా, ప్యాంటు తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. డీఎస్సీ లాంటివాటిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ. ఎంత ఎక్కువ వస్తుందంటే ఆయన పోతారేమోనని నాకు భయమేస్తుంది. ఆయన నిద్రపోతున్నపుడు ఎవరైనా తలుపు కొట్టి మావిగన్ అన్నారనుకోండి.. మనిషి ఏమవుతారోనని భయమేస్తుంది’ అని జగన్ వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం జగన్ గురువారం బెంగళూరుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన.. బుధవారం విశాఖపట్నం వెళ్లి వచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలో విలేకర్లతో మాట్లాడి, సాయంత్రం బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.