
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Iran Closed hormuz: ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేత అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే జరగుతుంది. ఇదే సమయంలో హర్మూజ్ ప్రాంతంలో అమెరికా బలగాలు, ఇరాన్ నౌకాదళ విభాగాల మధ్య కాల్పులు జరిగినట్లు ఇరానియన్ మీడియా కథనాలను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా బలగాలు బందర్ అబ్బాస్, సిరిక్, ఖేష్మ్ ద్వీపం, హెంగామ్ ద్వీపం పరిసర ప్రాంతాల్లోని తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు జరిపినట్లు సమాచారం.
ఇరాన్ ఐఆర్జీసీ నౌకాదళం ప్రకారం, హర్మూజ్ జలసంధిని అక్రమంగా దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలపై దాడులు జరిగాయి. అమెరికా దాడుల కారణంగా మినాబ్ కౌంటీలోని కర్గాన్ ప్రాంతంలో ఇద్దరు పౌరులు గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. మరోవైపు బందర్ అబ్బాస్ నగరంలో తాజాగా భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. సిరిక్, మినాబ్ పట్టణాలు, ఖేష్మ్ ద్వీపం, ఉత్తర ప్రాంతంలోని గోర్గాన్ నగరంలోనూ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా ఇరాన్ పై దాడులకు తెగపడినట్టు చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న పలావు జెండాతో ఉన్న ఎంటీ సెట్టెబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. క్షిపణి దాడితో నౌకలో అగ్నిప్రమాదం సంభవించగా ముగ్గురు నావికులు గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనను అంతర్జాతీయ సముద్ర సంస్థ ప్రధాన కార్యదర్శి ఆర్సెనియో డొమింగ్వెజ్ తీవ్రంగా ఖండించారు. సముద్రయాన సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.. గల్లంతైన నావికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ సముద్ర రవాణా భద్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ జరగాలని ఐఎంఓ కోరింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.
ఇక ఒమన్ తీరంలో జరిగిన ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఎంటీ సెట్టెబెల్లో నౌకలో మొత్తం 24 మంది భారతీయులు ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ముగ్గురు భారతీయులు ఇంకా గల్లంతైనట్లు తెలిపింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రాంతంలో నౌకలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుంచి ఎనిమిది నౌకలను నిర్వీర్యం చేశామని, 134 నౌకలను మళ్లించామని, మానవతా సహాయానికి సంబంధించిన 42 నౌకలకు అనుమతి ఇచ్చామని ఇరాన్ వెల్లడించింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్‌లో క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన వేళ గల్ఫ్ ప్రాంతమంతా అప్రమత్తమైంది. పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.