ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో టీవీకే విజయం సాధించగా.. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో మే 10న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు
ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే సినీ నటుడు కావడం, యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఆయన ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. వెంటనే టవల్ కల్చర్‌కు టాటా చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు కూర్చునే కుర్చీలపై ఓ తెల్లటి టవల్ ఉంచడం అనేది చాలా కాలంగా ఓ ఆచారంగా మారిపోయింది. విజయ్ సీఎం అయిన కొత్తలోనూ ఆయన కూర్చొన్న కుర్చీ మీద తెల్లటి టవల్ కప్పి ఉంచారు.లిసిప్రియ కంగుజం అనే నెటిజన్ అభ్యర్థనతో విజయ్ ఈ టవల్ కల్చర్‌కు వీడ్కోలు పలికారు. గతంలో వేడి వాతావరణం, ఆఫీసుల్లో ఏసీ లేకపోవడంతో కంఫర్ట్ కోసం వీఐపీల కుర్చీలపై ఇలా టవళ్లను వాడేవారు. కానీ కాలక్రమంలో అదొక ఆచారంగా మారింది. దానికి విజయ్ ముగింపు పలికారు.అంతే కాదు తమిళనాడు సీఎంవో ఆఫీసు సిబ్బంది ఇటీవల విజయ్ కూర్చొనే కుర్చీని మార్చేశారు. ఇటీవలి వరకు మెత్తటి కుషన్‌తో ఉన్న చెక్క కుర్చీని వాడగా.. ఇప్పుడు ఆయన లెదర్ హై బ్యాక్ ఛైర్‌ను ఉపయోగిస్తున్నారు. సీఎం విజయ్ కుర్చీ మారిన విషయాన్ని గమనించగానే సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ మొదలైంది. ఇప్పటి దాకా రూ. 11 వేల విలువైన చెక్క కుర్చీని వాడిన విజయ్.. ఇప్పుడు ఒకామురా లెజెండర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ వాడుతున్నారని.. దీని విలువ రూ. 32 లక్షలని.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొందరేమో ఈ కుర్చీ ధర రూ. 4 లక్షలు అని చెబుతున్నారు.అన్నాడీఎంకే ఐటీ వింగ్ అయితే సెటైరికల్‌గా స్పందించింది. కొత్త సోఫా, కొత్త కుర్చీ.. రోజుకో కారు.. మార్పులు అద్భుతంగా ఉన్నాయి బ్రో అంటూ యాక్టర్ విజయ్ ఎక్స్ అకౌంట్ ట్యాగ్ చేసి సెటైర్లు వేసింది.బీజేపీ శ్రేణులు అయితే విజయ్ను కసిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతకు ముందు ఢిల్లీ సీఎం రేఖ కొత్త కుర్చీలో కుర్చోన్న ఫొటోను.. తమిళనాడు సీఎం విజయ్ చెక్క కుర్చీలో కూర్చొన్న ఫొటోతో పోలుస్తూ.. విజయ్ సింప్లిసిటీతో ఉంటే.. ఢిల్లీ సీఎం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ టీవీకే శ్రేణులు ఎక్స్‌లో పోస్టులు చేశాయి. దీంతో ఇప్పుడు మాకు టైం వచ్చింది అన్నట్టుగా తమిళనాడు బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి.విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఆ కుర్చీని తమ అధినేత సొంత ఖర్చుతో కొనుగోలు చేశారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదని చెబుతున్నారు. వందల కోట్లు సంపాదించిన, స్టార్ డమ్ ఉన్న హీరో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడని.. ప్రజల సొమ్ము తినడం కోసం కాదని చెబుతున్నారు.సోషల్ మీడియాలో ఈ చర్చ విషయాన్ని పక్కనబెడితే.. తమిళనాడు సీఎంగా విజయ్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తాపత్రయ పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రతకు ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, డ్రగ్స్ నిరోధక చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఇటీవలే సింగప్పెన్ స్పెషల్ ఫోర్స్‌ను ప్రారంభించారు. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.