నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. నీతి ఆయోగ్
సమావేశం ముగిసిన తర్వాత.. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన ఆర్థిక, ఇతర సహకారాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇచ్చే రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనుల పురోగతిని ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు.. కావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. దీంతో పాటు తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన అత్యంత కీలకమైన 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 పనులకు కేంద్ర ప్రభుత్వ వాటాను.. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని రేవంత్ రెడ్డి కోరారు. అదే సమయంలో హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక, టెక్నికల్ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన జైపాల్ రెడ్డి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎస్ఐఎస్) సంబంధించి కేంద్ర జల సంఘం నుంచి త్వరగా ఆమోదం ఇప్పించాలని ఈ భేటీలో ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా సమావేశం అయ్యారు. పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించిన విషయాలపై కేంద్రమంత్రితో చర్చించారు.