
కరకగూడెం, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి సంభందించి భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్, పులుసుబొంత
ప్రాజెక్ట్ అధికారి మృణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. గురువారం కరకగూడెం మండల పరిధిలోని అనంతారం గ్రామం రైతు వేదిక భవనంలో కుడి, ఎడమ కాలువ నిర్మాణాల్లో 144.16 ఎకరాల భూమిని కోల్పోతున్న సమత్ మోతే రెవెన్యూ పరిధిలోని రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వారి అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాటాడుతూ.. భూములు కోల్పోయే ప్రతీ రైతుకు ప్రభుత్వం నుండి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. అనంతరం పలువురు రైతులు తమ అభ్యంతరాలను తెలిపారు. భూములు సర్వే చేసినప్పటికి ఇంతవరకు నోటీసులు రాలేదని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సర్వే పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకు భూములు కోల్పొయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ వట్టం కాంతయ్య, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.