
ఫ్రాన్స్‌లో జరగనున్న 52వ జీ7 దేశాల సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరవుతున్నారు
.
న్యూఢిల్లీ, జూన్ 11: ప్రతిష్ఠాత్మక 'G7 దేశాల సదస్సు'లో పాల్గొనేందుకు భారతదేశం సిద్ధమైంది. ఫ్రాన్స్‌లోని 'ఎవియాన్' (Evian) నగరంలో జరగనున్న 52వ జీ7 సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారతదేశం ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ఏడోసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో పీఎం మోదీ పర్యటన వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్లలో అధికారిక పర్యటనలు చేయనున్నారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ ఈ పర్యటన గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లను పరిష్కరించడంలో భారత్ చేస్తున్న కృషికి దక్కిన గుర్తింపునకు నిదర్శనమే ఈ నిరంతర భాగస్వామ్యమని చెప్పారు. జూన్ 15 నుంచి 17 వరకు జరిగే ఈ సదస్సులో, భారత్‌తో పాటు 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల) ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు.
జూన్ 16, 17 తేదీల్లో జరిగే అవుట్‌రీచ్ (Outreach) సెషన్లలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ ఏడాది జీ7 సదస్సులో ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. సురక్షితమైన, సమర్థవంతమైన పద్ధతిలో ఏఐ (AI) సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం. అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతలను తగ్గించి, సమతుల్య వృద్ధిని సాధించడం. కీలకమైన ఖనిజాల (Critical Minerals) సప్లై చైన్‌ను బలోపేతం చేయడం. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన అంతర్జాతీయ వివాదాలు, సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనడం. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఉమ్మడి పోరాటం. ఇవే ప్రధానాంశాలుగా సదస్సు జరుగబోతోంది.
జూన్ 13 - 14 (నైస్, ఫ్రాన్స్): పర్యటన మొదటి విడతలో భాగంగా ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌లోని 'నైస్' నగరానికి చేరుకుంటారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరుదేశాల బంధాన్ని 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్' స్థాయికి చేర్చిన తర్వాత జరుగుతున్న కీలక సమావేశం ఇది. ఇదే వేదికపై ఇరునేతలు కలిసి 'భారత్ ఇన్నోవేట్స్' (Bharat Innovates) ఈవెంట్‌ను ప్రారంభిస్తారు. రెండు దేశాల స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులను అనుసంధానించడం దీని ముఖ్య ఉద్దేశం.
జూన్ 15 - 17 (ఎవియాన్, ఫ్రాన్స్): 52వ జీ7 సదస్సులో భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. సదస్సు వేదికగా పలువురు ప్రపంచ నేతలతో మోదీ విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. యూరప్‌లోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ అయిన 'వివాటెక్' (VivaTech) సదస్సులో కూడా భారత్ తన డిజిటల్ రూపాంతర నైపుణ్యాలను ప్రదర్శించనుంది.
జూన్ 18 (పారిస్): పర్యటన చివరి రోజున ప్రధాని మోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంటారు. అక్కడ అదనపు ద్వైపాక్షిక చర్చలతో పాటు, పారిస్‌లోని ప్రవాస భారతీయులను (Indian Community) ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక, సాంకేతిక, భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశం ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామిగా, గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోబోతోంది.
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..